కాంగ్రెస్‌లో కీలక భేటీ.. కొండా మురళి కీలక వ్యాఖ్యలు…!

కాంగ్రెస్‌లో కీలక భేటీ.. కొండా మురళి కీలక వ్యాఖ్యలు..

ప్రజా భవన్‌లో కాంగ్రెస్‌కు చెందిన కీలక నేతల సమావేశం ముగిసింది. మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి భేటీ కావడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఇటీవల పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలపై నేతలు చర్చించినట్లు సమాచారం.
అయితే తన నియోజకవర్గానికి సంబంధించిన పెండింగ్ బిల్లుల అంశంపైనే భట్టి విక్రమార్కను కలిసేందుకు ప్రజా భవన్‌కు వచ్చినట్లు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. తాను వెళ్లే సమయానికి అక్కడ కొండా మురళి ఉన్నారని, తనకు జరిగిన భేటీకి రాజకీయ అంశాలతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
మరోవైపు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డితో భేటీ అనంతరం కొండా మురళి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తన కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు.
క్రమశిక్షణ కమిటీ నిర్ణయం వెలువడే వరకు వివాదంపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని కొండా మురళి తెలిపారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ పట్ల తమకు గౌరవం, విశ్వాసం ఉందన్నారు.
తాను ఇప్పటివరకు వరంగల్‌కు కూడా వెళ్లలేదని, సుస్మిత వివాదంతో తమకు సంబంధం లేదని పేర్కొన్నారు. “నా కూతురు ప్లాన్ నాకు ఎలా తెలుస్తుంది. సుస్మిత ప్లాన్ ఏలో మాట్లాడింది.. ప్లాన్ బీలో ఏం చేస్తుందో నాకు తెలియదు” అంటూ వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్ నుంచి కవిత కూడా వెళ్లిపోయారని ప్రస్తావించిన కొండా మురళి.. భట్టి విక్రమార్కతో రాజకీయ అంశాలపై కాకుండా యోగక్షేమాలు మాత్రమే మాట్లాడుకున్నామని తెలిపారు.