నేపాల్లో సంభవించిన ఆక్మసిక వరదల(Nepal Floods)కు కారణం ఏంటన్న దానిపై అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకటన చేసింది. టిబెట్ వైపు ఉన్న హిమాలయ పర్వతంలోని మంచు కొండ విరిగిపడడం వల్ల.. శిథిలాలు, బురుదతో కూడిన వరద విలయం వచ్చినట్లు పేర్కొన్నది. ముందుగా అంచనా వేసినట్లు భూకంపం కాదు అని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. మంచుపర్వతం బద్దలు కావడం.. దాంతో బురద నీరు మహోగ్రంగా పోటెత్తిందని.. ఆ ప్రవాహం దిగువ ప్రాంతాలను ముంచెత్తినట్లు ఆ సంస్థ తెలిపింది. బుధవారం టిబెట్లో 4.4 తీవ్రతతో భూకంపం రావడం వల్ల .. జల విలయం సంభవించినట్లు తొలుత యూఎస్ జియోలాజికల్ సర్వే అంచనా వేసింది. కానీ మరింత విశ్లేషణ తర్వాత తమ ప్రకటనలో మార్పు చేశారు.సమీపంలో ఉన్న సెసిమిక్ స్టేషన్లు, సెసిమిక్ వేవ్స్, శాటిలైట్ ఇమేజ్ల ఆధారంగా తాజా అంచనా వేసినట్లు పేర్కొన్నారు. మంచుశిఖరం కుప్పకూలడంతో.. భీకర స్థాయిలో బురద పోటెత్తినట్లు గుర్తించారు. భూకంపం ఏమీ సంభవించలేదని యూఎస్జీఎస్ తాజాగా పేర్కొన్నది. నేపాలీ అధికారులు కూడా ఇదే తరహా వివరణ ఇచ్చారు. హిమాలయ శిఖరంపై ఉన్న మంచు ఫలకం కుప్పకూలిందని, ఆ భారీ శిథిలాలతో రాళ్లు కూడా కొట్టుకువచ్చాయని నేపాలీ అధికారులు చెప్పారు. ప్లానెట్ ల్యాబ్స్కు చెందిన శాటిలైట్ ఇమేజ్ల ఆధారంగా కూడా ఓ అంచనా వేశారు..
నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతంలో ప్రకృతి సృష్టించిన బీభత్సం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అయితే ఈ ముప్పు ఇంతటితో ఆగిపోలేదని, మరోసారి డేంజర్ ముంచుకొచ్చే అవకాశం ఉందని హిమాలయ ప్రాంతాలపై అధ్యయనం చేసే అంతర్జాతీయ సంస్థ ఐసీఐఎమ్ఓడీ(ICIMOD) కీలక హెచ్చరికలు జారీ చేసింది.