సముద్ర మట్టాల పెరుగుదల.. భారత్కు పెను ముప్పు..! ముంబై, కోల్కతాతో పాటు దక్షిణాసియాలో 1.4 కోట్ల మందికి పైగా ప్రజలకు ముంపు ప్రమాదం..!
సముద్ర మట్టాల పెరుగుదల.. భారత్కు పెను ముప్పు!
ముంబై, కోల్కతాతో పాటు దక్షిణాసియాలో 1.4 కోట్ల మందికి పైగా ప్రజలకు ముంపు ప్రమాదం
Kolkata Mumbai Sea Level Risk
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు వేగంగా పెరుగుతుండటం తీర ప్రాంతాలకు పెను ముప్పుగా మారుతోంది. భారత్లోని ముంబై, కోల్కతాతో పాటు బంగ్లాదేశ్ రాజధాని ఢాకా వంటి నగరాల్లోని లక్షలాది మంది ప్రజలు భవిష్యత్తులో తమ నివాసాలను కోల్పోయే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. దక్షిణాసియాలోని లోతట్టు తీర ప్రాంతాల్లో నివసిస్తున్న 1.4 కోట్ల మందికి పైగా ప్రజలు శాశ్వత ముంపు ముప్పును ఎదుర్కొంటున్నారని ఐరాస సెక్రటరీ జనరల్ సమర్పించిన ‘సముద్ర మట్టాల పెరుగుదల–ఎదురవుతున్న సవాళ్లు–పరిష్కార మార్గాలు’ నివేదికలో వెల్లడించింది.
సముద్ర మట్టాల పెరుగుదల ఇక భవిష్యత్తులో ఎదురయ్యే సమస్య కాదని, ఇప్పటికే దాని ప్రభావాలు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్నాయని నివేదిక స్పష్టం చేసింది. సముద్ర మట్టాలు పెరగడం వల్ల తీర ప్రాంత ప్రజల నివాసాలు, జీవనోపాధితో పాటు రహదారులు, రవాణా వ్యవస్థలు, విద్యుత్ గ్రిడ్లు, నీటి వనరులు, భవనాలు, భూగర్భ జలాలు తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు అనే తేడా లేకుండా సముద్ర మట్టాల పెరుగుదల మానవాళికి పెద్ద సవాలుగా మారుతోందని ఐరాస తెలిపింది. అమెరికాలోని మియామి, న్యూయార్క్, చైనాలోని గ్వాంగ్జౌ వంటి ప్రధాన నగరాల్లో భారీ విలువైన తీర ప్రాంత మౌలిక వసతులు ప్రమాదంలో ఉన్నాయని పేర్కొంది. ఈ ప్రాంతాల్లో ముప్పును ఎదుర్కొంటున్న తీర ప్రాంత మౌలిక వసతుల విలువ 2 ట్రిలియన్ డాలర్ల నుంచి 3.5 ట్రిలియన్ డాలర్ల వరకు ఉంటుందని అంచనా వేసింది.
రికార్డు స్థాయిలో పెరుగుతున్న సముద్ర మట్టాలు
సముద్ర మట్టాల పెరుగుదలకు మానవ కార్యకలాపాల కారణంగా ఏర్పడుతున్న గ్లోబల్ వార్మింగ్ ప్రధాన కారణమని నివేదిక పేర్కొంది. హిమనీనదాలు, మంచు పొరలు కరగడం, సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడం వంటి పరిణామాలు సముద్ర మట్టాల పెరుగుదలకు దోహదపడుతున్నాయని తెలిపింది.
2014 నుంచి 2023 మధ్య ప్రపంచ సముద్ర మట్టం సగటున సంవత్సరానికి 4.7 మిల్లీమీటర్ల చొప్పున పెరిగింది. 2024లో ఒక్క సంవత్సరంలోనే 5.9 మిల్లీమీటర్ల మేర పెరగడం ఆందోళన కలిగించే పరిణామంగా నివేదిక పేర్కొంది. 2023–24 మధ్య సముద్ర మట్టాల పెరుగుదలకు అసాధారణ సముద్ర ఉష్ణోగ్రతలు, ఎల్నినో ప్రభావం కూడా కారణమయ్యాయని వివరించింది. 2025లోనూ ప్రపంచ సగటు సముద్ర మట్టం 2024లో నమోదైన రికార్డు స్థాయికి సమీపంలోనే కొనసాగిందని పేర్కొంది.
77 కోట్ల మందికి తీర ప్రాంత ముప్పు
ప్రపంచవ్యాప్తంగా సుమారు 77 కోట్ల మంది ప్రజలు సముద్ర మట్టానికి ఐదు మీటర్ల కంటే తక్కువ ఎత్తులో ఉన్న తీర ప్రాంతాల్లో నివసిస్తున్నారని ఐరాస తెలిపింది. ప్రపంచ జనాభాలో దాదాపు 10 శాతం మంది ఈ ప్రాంతాల్లో నివసిస్తున్నారని పేర్కొంది.
సముద్ర మట్టాలు మరింత పెరిగితే తీర ప్రాంత వరదలు, ఉప్పునీరు భూభాగంలోకి చొచ్చుకురావడం, తాగునీటి వనరులు కలుషితం కావడం, వ్యవసాయ భూములపై ప్రభావం పడటం వంటి సమస్యలు తీవ్రతరం కావచ్చని హెచ్చరించింది. ముఖ్యంగా భూగర్భ జలాలు, బావులు ఉప్పునీటితో కలుషితమైతే తాగునీటి లభ్యతపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపింది.
ఆరోగ్యంపైనా ప్రభావం
సముద్ర మట్టాల పెరుగుదల వల్ల ప్రజల ఆరోగ్యంపైనా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఐరాస హెచ్చరించింది. తీర ప్రాంతాల్లో పారిశుద్ధ్య వ్యవస్థలు, మౌలిక వసతులు దెబ్బతినడం వల్ల నీటి ద్వారా వ్యాపించే వ్యాధుల ముప్పు పెరగవచ్చని పేర్కొంది. అదే సమయంలో తరచూ వచ్చే వరదలు, నివాస ప్రాంతాలపై ముప్పు కారణంగా ప్రజల్లో మానసిక ఒత్తిడి కూడా పెరిగే అవకాశం ఉందని తెలిపింది.
తీర ప్రాంతాలను రక్షించేందుకు ప్రభుత్వాలు ముందస్తు ప్రణాళికలు రూపొందించడంతో పాటు దీర్ఘకాలిక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఐక్యరాజ్యసమితి స్పష్టం చేసింది. సముద్ర మట్టాల పెరుగుదలను ఎదుర్కొనేందుకు మౌలిక వసతుల బలోపేతం, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, తీర ప్రాంత రక్షణ చర్యలు అత్యవసరమని సూచించింది.