బిజెపి రాష్ట్ర కార్యాలయం, నల్గొండ జిల్లా అధ్యక్షుల ఇంటిపై దాడులను ఖండిస్తూ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం..!

బిజెపి రాష్ట్ర కార్యాలయం, నల్గొండ జిల్లా అధ్యక్షుల ఇంటిపై దాడులను ఖండిస్తూ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం..

హుజూర్‌నగర్: బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై, నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుల నివాసంపై జరిగిన దాడులను నిరసిస్తూ *బిజెపి హుజూర్‌నగర్ పట్టణ అధ్యక్షులు కొండ హరీష్ గౌడ్* ఆధ్వర్యంలో గురువారం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా *తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ* ను దహనం చేసి కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా *భారతీయ జనతా పార్టీ హుజూర్‌నగర్ పట్టణ అధ్యక్షులు కొండ హరీష్ గౌడ్* మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో రాజకీయ ప్రత్యర్థులపై భౌతిక దాడులకు పాల్పడటం అత్యంత దుర్మార్గమైన చర్య అని అన్నారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంపై, నల్గొండ జిల్లా అధ్యక్షుల ఇంటిపై జరిగిన దాడులు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి, అధికార పార్టీ అహంకారానికి నిదర్శనమని తీవ్రంగా విమర్శించారు. ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కాలని చూస్తే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరని, బిజెపి కార్యకర్తలపై దాడులు చేస్తే ప్రతి కార్యకర్త మరింత రెట్టించిన ఉత్సాహంతో ప్రజాక్షేత్రంలో పోరాడుతారని అన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని బీజేపీ నాయకులు, కార్యకర్తలను భయపెట్టాలని చూస్తే అది కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని, *అధికారం శాశ్వతం కాదు…ప్రజల తీర్పే అంతిమం* అని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడాల్సిన ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలను ప్రోత్సహించడం సిగ్గుచేటని, దాడులకు పాల్పడిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయ హింసకు స్వస్తి పలికి, ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఉందని అన్నారు.

బిజెపి కార్యాలయాలు నాయకుల ఇళ్లపై దాడులు జరుగుతున్న ప్రభుత్వం నిందితులపై కఠిన చర్యలు తీసుకోకపోవడం అనేక అనుమానాలకు తావిస్తుందని కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి దాడులకు పాల్పడిన వారిని వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని అలాగే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు కొండ హరీష్ గౌడ్ తో పాటు రూరల్ మండల అధ్యక్షులు మాడుగుల లక్ష్మీనారాయణ, మఠంపల్లి మండల అధ్యక్షులు బొమ్మనబోయిన వెంకట శివ, ఓబీసీ మోర్చ జిల్లా ఉపాధ్యక్షుడు జనిగల శ్రీనివాస్ గౌడ్, పట్టణ ప్రధాన కార్యదర్శులు గుండా గోపి, రాళ్లబండి రామారావు, దళిత మోర్చా నాయకులు మేళ్లచెరువు లక్ష్మణ్, పట్టణ ఉపాధ్యక్షుడు పైడిమర్రి విజయ్, కొప్పెర సాయిరాం, యువమోర్చా అధ్యక్షుడు సతి బల్వంత్ సింగ్, గిరిజన మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి రంగానాయక్, సైదా నాయక్ మరియు మహిళా మోర్చా నాయకులు తదితరులు పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.