తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్ధం..

ఈరోజు ఉదయం 10 గంటలకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

గన్ పార్క్ వద్ద నివాళులు అర్పించి, అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు..

అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు సర్వం సిద్ధం
అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు సర్వం సిద్ధమైంది. ఉదయం పదిగంటలకు ప్రారంభం కానున్న అసెంబ్లీ మండలి సమావేశాలు వాడీవేడిగాసాగే అవకాశం ఉంది. ‘సెంట్రల్‌ హాల్‌’ను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. తొలిరోజు ప్రధానంగా ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఉంటుందని సమాచారం. ముఖ్యమైన నివేదికలను ప్రభుత్వం సభ ముందుకు తీసుకురానుంది. ప్రశ్నోత్తరాల తర్వాత మూడు ప్రధాన అంశాలకు సంబంధించిన నివేదికలు సీఎం టేబుల్‌ చేయనున్నారు. తెలంగాణ సమగ్రశిక్ష 2024–25 ఆడిట్‌ నివేదిక, పీఎం శ్రీ తెలంగాణ 2024–25 ఆడిట్‌ నివేదిక ప్రవేశపెట్టనున్నారు. మెట్రోకు సంబంధించి ఐదు వార్షిక నివేదికలు సభ ముందుకు రానున్నాయి. 22ఏ భూముల వ్యవహారంపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. 22ఏపై అన్నివిధాలుగా చర్చించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై సభలో చర్చ జరిగే అవకాశం ఉంది…

ఇవాళ అసెంబ్లీ ముట్టడికి బీజేపీ పిలుపు.

ఇవాళ్టి నుంచి శాసనసభ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బీజేపీ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ విడుదల చేయాలని బీజేపీ డిమాండ్ చేయనుంది. 22ఏలో ప్రైవేటు భూములను తీసివేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపట్టనున్నట్లు సమాచారం. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసేలా బీజేపీ ప్రణాళిక రచించింది..

గులాబీ పార్టీ స్క్రిప్ట్‌ రెడీ

వర్షాకాల సమావేశాలు అధికార, ప్రతిపక్షాల మధ్య మరోసారి హోరాహోరీ రాజకీయ సమరానికి వేదిక కానున్నాయి. అసెంబ్లీలో అధికార కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీఆర్‌ఎస్‌ అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతుండగా.. ప్రతిపక్షం దాడిని డైవర్షన్‌ రాజకీయంతో ఎదురొనేందుకు అధికారపక్షం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. కాంగ్రెస్‌ ‘వెయ్యి రోజుల వైఫల్యాల’పై బీఆర్‌ఎస్‌ తరఫున కేటీఆర్‌ మాట్లాడేందుకు సిద్ధం అయ్యారు.
22ఏ నిషేధిత భూముల వివాదం, సాగునీటి ప్రాజెక్టులు, పాలిటెక్నిక్‌, విద్యార్థుల సమస్యల అస్ర్తాలను సంధించేందుకు బీఆర్‌ఎస్‌ శాసనసభా పక్ష ఉపనేత హరీశ్‌రావు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, సంక్షేమ పథకాల బకాయిలు.. ఇలా ఒకో అంశాన్ని తీసుకొని ప్రభుత్వాన్ని సభలో నిలదీసేందుకు గులాబీ పార్టీ స్క్రిప్ట్‌ రెడీ చేసుకుంటున్నట్టు సమాచారం.