ఖైరతాబాద్ గణనాథుడి శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగుతోంది. విజయవాడ నుంచి తీసుకొచ్చిన భారీ టస్కర్ వాహనంపై ఈ 69 అడుగుల గణనాథుడిని తరలిస్తున్నారు. ఖైరతాబాద్ నుంచి ప్రారంభమైన ఈ శోభాయాత్ర.. సెన్సేషన్ థియేటర్, రాజ్‌దూత్ చౌరస్తా, టెలిఫోన్ భవన్, ఇక్బాల్ మినార్, తెలంగాణ తల్లి చౌరస్తా మీదుగా ఎన్టీఆర్ మార్గ్ వైపు సాగుతోంది. ఎన్టీఆర్ మార్గ్ లోని క్రేన్ నెంబర్ 5 వద్ద ఈ భారీ గణేశాను నిమజ్జనం చేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటల లోపు ఈ నిమజ్జనం కార్యక్రమం పూర్తయ్యేలా ఉత్సవ కమిటీ, అధికారులు ఏర్పాట్లు చేశారు.
దారిపొడవునా భక్తజనం..

మరోవైపు ఖైరతాబాద్ గణనాథుడ్ని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున నగరవాసులు శోభయాత్రలో పాల్గొంటున్నారు. వేలాది మంది భక్తులు దారిపొడవునా చేరుకొని.. గణనాథుడి ఆశీస్సులు పొందుతున్నారు. స్థానికులు తమ ఇళ్లు, భవనాలపైకి ఎక్కి.. ఈ శోభాయాత్రను ఎంతో ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఇందుకు సంబంధించిన డ్రోన్ దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి.
రాష్ట్రంలోనే అతిపెద్ద గణనాథుడ్ని నిమజ్జనం చేసేందుకు అధికారులు సూపర్ క్రేన్ ను సిద్ధం చేశారు. గత ఐదేళ్లుగా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన కార్యక్రమంలో ఈ అతి భారీ క్రెయిన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. నిమజ్జనం సాఫీగా సాగేందుకు అవసరమైన అన్ని పరీక్షలను విజయవంతంగా నిర్వహించి ఈ సూపర్ క్రేన్ ను ఎన్టీఆర్ మార్గ్ కు తీసుకొచ్చినట్లు ఆపరేటర్లు చెబుతున్నారు. కాగా గతంలో బ్రిడ్జిలు, భారీ రాళ్లు ఎత్తే పనుల్లో ఈ క్రేన్ ను వినియోగించడం గమనార్హం..
ట్యాంక్‌బండ్‌కు పోటెత్తిన భక్తులు.
మరోవైపు ట్యాంక్‌బండ్, హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో గణేశ్ నిమజ్జన సందడి నెలకొంది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి గణనాథులను తీసుకొచ్చే వాహనాలతో ప్రధాన మార్గాలు సందడిగా మారాయి. ఖైరతాబాద్ బడా గణేశుడికి వీడ్కోలు పలికేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తెలంగాణ తల్లి ఫ్లైఓవర్, సచివాలయం పరిసరాల్లోనూ భక్తుల రద్దీ కనిపిస్తోంది. ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర సాగే మార్గాన్ని పోలీసులు నియంత్రించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ట్రాఫిక్ ఆంక్షలు, భద్రతా చర్యలు చేపట్టారు.
45 వేల మంది పోలీసులతో భద్రత.
గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా హైదరాబాద్ నగరంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. రాజధాని శివారు ప్రాంతాల నుంచి హుస్సేన్‌సాగర్ వరకు నాలుగు కమిషనరేట్ల పరిధిలో సుమారు 45 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. హుస్సేన్‌సాగర్ పరిసరాల్లోనే సుమారు వెయ్యి మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు..