దక్షిణాసియాలో భారత్‌ ఒక సురక్షితమైన డిజిటల్‌ హబ్‌..చైనా మార్గం నుంచి తప్పుకుంటున్న ఇంటర్నెట్‌ కేబుల్స్‌..!

ప్రపంచంలోని దాదాపు 99 శాతం ఇంటర్నెట్‌ డాటా సముద్రం అడుగున ఏర్పాటు చేసిన కేబుల్స్‌ ద్వారా సరఫరా అవుతుంది. గత పందేండ్లుగా చైనా ఉనికి ఉన్న దక్షిణ చైనా సముద్రం, ఎర్ర సముద్రం ప్రధాన మార్గాలుగా ఉన్నాయి. అయితే యుద్ధాలు, ఉద్రిక్తతలు, అధికారిక జాప్యం కారణంగా కంపెనీలు ఇప్పుడు ఈ మార్గాలను నివారిస్తున్నాయి. కృత్రిమ మేధ(ఏఐ) వంటి సేవల కోసం అంతరాయం లేని, అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్‌ను అందించేందుకు హిందూ మహాసముద్రం మీదుగా నేరుగా కొత్త ఇంటర్నెట్‌ కేబుళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కీలక పరిణామం వల్ల భారత్‌ గణనీయంగా లబ్ధి పొందుతున్నది. ముంబై తర్వాత ఇప్పుడు చెన్నై ప్రపంచంలోనే అదుపరి ప్రధాన ఇంటర్నెట్‌ కేంద్రంగా ఎదుగుతున్నది. దక్షిణాసియాలో భారత్‌ ఒక సురక్షితమైన డిజిటల్‌ హబ్‌గా ఎదుగుతున్నది.

దేశ ఆర్థిక స్థితిపై ప్రభావం..

ప్రపంచవ్యాప్త ఇంటర్నెట్‌ ట్రాఫిక్‌లో 99 శాతం సముద్రగర్భ కేబుళ్ల ద్వారానే సరఫరాఅవుతుంది. ఇవి లేకపోతే ప్రపంచ బ్యాంకింగ్‌, సమాచార వ్యవస్థలు, ఆర్థిక వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోతాయి. ఏఐ, క్లౌడ్‌ డాటా, సూపర్‌ కంప్యూటింగ్‌ కోసం ఉన్న భారీ అవసరాల కారణంగా రాబోయే సంవత్సరాలలో వాటి వ్యూహాత్మక ప్రాముఖ్యత అనేక రెట్లు పెరుగుతుంది. ఇది దాదాపు ఒక ‘అదృశ్య యుద్ధం’ లాంటిది. ఇందులో క్షిపణిని ప్రయోగించాల్సిన అవసరం లేకుండానే ఒక దేశానికి చెందిన కేబుళ్లను కత్తిరించడం ద్వారా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయవచ్చు.

కేబుల్‌ కత్తిరిస్తే ఏమవుతుంది?..

ఇంటర్నెట్‌ పూర్తిగా నిలిచిపోదు. ఏదైనా కేబుల్‌ తెగిపోయినప్పుడు డాటాను ఇతర కేబుళ్ల ద్వారా మళ్లిస్తారు. ఒక కేబుల్‌ విఫలమైనా మరొకటి పనిచేసేలా కంపెనీలు డాటా ట్రాఫిక్‌ను అనేక కేబుళ్ల ద్వారా పంపిణీ చేస్తాయి. తక్కువ కేబుల్‌ ఉన్న ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ వేగం తగ్గవచ్చు లేదా కొన్ని సేవలకు అంతరాయం కలగవచ్చు. ఉపగ్రహ అనుసంధానం సేవలకు బ్యాకప్‌గా కూడా ఉపయోగపడుతుంది. ఒక ప్రాంతంలో కేవలం ఒకే ఒక కేబుల్‌ ఉండి అది తెగిపోతే అక్కడ ఇంటర్నెట్‌ పూర్తిగా నిలిచిపోవచ్చు.