విజయవాడ విమాన ప్రయాణికులకు మరింత మెరుగైన కనెక్టివిటీ అందుబాటులోకి వచ్చింది. విజయవాడ నుంచి వారణాసి, కోల్కతా నగరాలకు కొత్త ఇండిగో విమాన సర్వీసులు గురువారం ప్రారంభమయ్యాయి..విజయవాడ-వారణాసి-కోల్కతా మార్గంలో ప్రారంభమైన ఈ విమాన సేవల కార్యక్రమం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి వర్చువల్గా కార్యక్రమంలో పాల్గొన్నారు.
విమానాశ్రయ అధికారుల ప్రకటనను ఉటంకిస్తూ PTI తెలిపిన వివరాల ప్రకారం, ప్రారంభ రోజే కొత్త సర్వీసులకు ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభించింది. వారణాసి నుంచి విజయవాడకు వచ్చిన విమానంలో 89 మంది ప్రయాణికులు ఉండగా, విజయవాడ నుంచి వారణాసికి బయలుదేరిన విమానంలో 129 మంది ప్రయాణించారు.
వారానికి మూడు రోజుల సర్వీసులు
కొత్త విమాన సేవలు వారానికి మూడు రోజులు-మంగళవారం, గురువారం, శనివారం అందుబాటులో ఉంటాయి. ఇండిగోకు చెందిన 6E 6501 విమానం కోల్కతా నుంచి మధ్యాహ్నం 2.15 గంటలకు బయలుదేరి 3.25 గంటలకు వారణాసి చేరుతుంది. అక్కడి నుంచి 3.55 గంటలకు బయలుదేరి సాయంత్రం 5.50 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. అదేవిధంగా 6E 6502 విమానం విజయవాడ నుంచి సాయంత్రం 6.20 గంటలకు బయలుదేరి రాత్రి 8.15 గంటలకు వారణాసి చేరుతుంది. అక్కడ 8.50 గంటలకు బయలుదేరి రాత్రి 10.15 గంటలకు కోల్కతా చేరుతుంది. ఈ కార్యక్రమానికి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రత్యక్షంగా హాజరయ్యారు. ప్రారంభ విమానంలో ప్రయాణించిన వారికి తొలి బోర్డింగ్ పాస్లను వారు అందజేశారు.