హుజూర్నగర్: పట్టణంలో 2008లో ప్రారంభమైన నేషనల్ జిమ్ 18 సంవత్సరాల విజయవంతమైన ప్రస్థానాన్ని పూర్తి చేసుకుని 19వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం నేషనల్ జిమ్లో 18వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నేషనల్ జిమ్ యాజమాన్యం రవి మాస్టర్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా నేషనల్ జిమ్ యాజమాన్యం రవి మాస్టర్ మాట్లాడుతూ.. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల శరీర దృఢత్వంతో పాటు గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని, కండరాలు బలపడటంతో పాటు బరువు నియంత్రణలో ఉంటుందని తెలిపారు. వ్యాయామం మానసిక ఒత్తిడిని తగ్గించి ఆరోగ్యకరమైన జీవనశైలికి దోహదపడుతుందని పేర్కొన్నారు.
“వ్యాధి వచ్చిన తర్వాత వైద్యం చేయించుకోవడం కంటే.. వ్యాధి రాకముందే వ్యాయామం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మేలు” అని రవి మాస్టర్ అన్నారు. ప్రతి ఒక్కరూ వయస్సుతో సంబంధం లేకుండా తమ శరీర సామర్థ్యానికి అనుగుణంగా వ్యాయామాన్ని నిత్య జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు.
సరైన వ్యాయామంతో పాటు సమతుల్య ఆహారం, తగినంత నిద్ర ఆరోగ్యకరమైన జీవితానికి ఎంతో అవసరమని తెలిపారు. గత 18 సంవత్సరాలుగా నేషనల్ జిమ్ ఆరోగ్యమే లక్ష్యంగా పనిచేస్తూ ఎంతోమందిని వ్యాయామం వైపు ప్రోత్సహించడం ఆనందంగా ఉందన్నారు.
నేషనల్ జిమ్ 18వ వార్షికోత్సవం సందర్భంగా జిమ్ సభ్యులు, వ్యాయామ ప్రియులు, శ్రేయోభిలాషులు రవి మాస్టర్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిమ్ సభ్యులు, వ్యాయామ ప్రియులు తదితరులు పాల్గొన్నారు.