రెండు బిలియన్ ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పురాతన పర్వత వ్యవస్థ ఇప్పుడు మనుగడ కోసం పోరాడుతోంది. అసలు ఆరావళి ప్రత్యేకత ఏంటి? సుప్రీంకోర్టు నిర్ణయంపై పర్యావరణవేత్తలు ఎందుకు ఆందోళన చెందుతున్నారు?..
భారతదేశానికి రక్షణ కవచంలా నిలిచే ఆరావళి పర్వత శ్రేణులు తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్నాయని తాజా సర్వేలో తేలింది. ఆరావళిలో కేవలం 0.19 శాతం ప్రాంతం మాత్రమే ప్రభావితమైందన్న కేంద్ర ప్రభుత్వ వాదనను తప్పుపడుతూ ‘వి ఆర్ ఆరావళి’ అనే ప్రజా పరిరక్షణ వేదిక సంచలన గణాంకాలను బయటపెట్టింది. శాటిలైట్ డేటా ఆధారంగా చేసిన ఆడిట్లో ఆరావళి శ్రేణిలో దాదాపు 31.8 శాతం ప్రాంతం (1/3వ వంతు భాగం) పర్యావరణ పరంగా అత్యంత ప్రమాదకర స్థితిలో ఉందని పేర్కొంది.
90 శాతం ప్రాంతం చట్టపరమైన రక్షణ కోల్పోయి నాశనమవుతుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎక్కడ తప్పు జరుగుతోంది?.
‘బ్రిస్టల్ ఎఫ్ఏబీడీఈఎం మోడల్ ద్వారా నిర్వహించిన ఈ ఫోరెన్సిక్ విశ్లేషణలో పలు షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ వర్గీకరణ ప్రకారం 100మీ కంటే తక్కువ ఎత్తుగల వాటిని ‘పర్వతాలు’గా గుర్తించడం లేదు. దీని వల్ల దాదాపపు 31.8 శాతం ఆరావళి ప్రాంతం చట్టపరమైన రక్షణను కోల్పోయింది. పైగా ప్రభుత్వం వీటిని కేవలం ‘బంజరు భూములు’గా పరిగణిస్తూ, మైనింగ్‌కు అనుమతులు ఇస్తోంది’ అని పర్యావరణ శాస్త్రవేత్త డాక్టర్ సుధాంశు అన్నారు.
ప్రజలకు ఇక్కట్లు తప్పవా?
వాస్తవానికి తక్కువ ఎత్తులో ఉండే కొండలే భూగర్భ జలాల పునరుద్ధరణకు (గ్రౌండ్ వాటర్ రీఛార్జ్)కు కీలకం. ఒక వేళ ఆరావళి శ్రేణిలోని 100 మీటర్ల కంటే తక్కువ ఎత్తు గల కొండలను తొలగిస్తే, జైపుర్, గురుగ్రామ్ లాంటి నగరాలు నీరు లేక కరవుతో అలమటించాల్సి వస్తుంది. అంతేకాదు రాజస్థాన్, హరియాణా, దిల్లీల్లో నీటి భద్రత, గాలి నాణ్యత ఉండకుండా పోతుంది.
వాస్తవానికి థార్ ఎడారి విస్తరించకుండా ఈ ఆరావళి కొండలే సహజ అడ్డుగోడలుగా పనిచేస్తున్నాయి. వీటిని కనుక తొలగిస్తే వాయువ్య భారత దేశం పూర్తిగా ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉందని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వాతావరణ కాలుష్యాన్ని అరికట్టే శక్తి ఈ సహజ పర్వత శ్రేణులకు ఉంది. కానీ వీటిని మైనింగ్ చేసి నాశనం చేస్తే, వాయు కాలుష్యం పెరిగి సుమారు 30 కోట్ల మంది ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉంది..
ఎడారీకరణ నిరోధం: థార్ ఎడారి తూర్పు వైపు విస్తరించకుండా ఇవి ఒక కవచంలా అడ్డుకుంటాయి.
భూగర్భ జలాలు: ఇవి సహజ సిద్ధమైన రీఛార్జ్ జోన్లుగా పనిచేస్తూ లక్షలాది మందికి నీటి భద్రతను కల్పిస్తాయి.
కాలుష్య నియంత్రణ: దుమ్ము తుఫానులను తగ్గించడంలో గాలి నాణ్యతను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
ఎన్ని రాష్ట్రాల్లో విస్తరించి ఉంది? ఈ పర్వత శ్రేణి ఈశాన్యం నుంచి నైరుతి దిశగా సుమారు 600–700 కి.మీ పొడవునా విస్తరించి ఉంది. ఇది మొత్తం 4 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో తన ప్రభావాన్ని చూపుతోంది:
ఢిల్లీ: ఇక్కడే ఈ శ్రేణి ప్రారంభమవుతుంది.
హర్యానా: దక్షిణ హర్యానాలోని గురుగ్రామ్, ఫరీదాబాద్, నుహ్ జిల్లాల గుండా వెళుతుంది.
రాజస్థాన్: అల్వార్, జైపూర్, ఉదయపూర్ మరియు మౌంట్ అబూ మీదుగా మెజారిటీ భాగం ఇక్కడే ఉంది.
గుజరాత్: అహ్మదాబాద్ సమీపంలోని పలన్‌పూర్ వద్ద ఈ శ్రేణి ముగుస్తుంది.
ముప్పు పొంచి ఉందా? తక్కువ ఎత్తు ఉన్న కొండలను ఆరావళి పరిధి నుంచి తొలగించడం వల్ల అక్రమ మైనింగ్, రియల్ ఎస్టేట్ మాఫియా పెచ్చరిల్లే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల ఢిల్లీ, హర్యానా ప్రాంతాల్లో గాలి నాణ్యత పడిపోవడమే కాకుండా, ఎడారి వేగంగా విస్తరించే ముప్పు ఉందని పర్యావరణవేత్తలు మొరపెట్టుకుంటున్నారు…
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959