ప్రస్తుతం భారతదేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి… దీంతో వరద పరిస్థితులు నెలకొన్నాయి. కొన్నిచోట్ల కొండచరియలు విరిగిపడి ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇక ఇదే కాశ్మీర్ లో ఉష్ణోగ్రతలు పూర్తిగా కుప్పకూలి కొన్నిచోట్ల మంచు తుపానులు ఏర్పడుతున్నాయి. మరోవైపు పొరుగురాష్ట్రం తమిళనాడులో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ రాష్ట్రంలోని కొన్ని జలపాతాలు వర్షాల కారణంగా ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి… దీంతో పర్యాటకులను అనుమతించడంలేదు. దీన్నిబట్టే తమిళనాడులో ఏ స్థాయిలో వానలు పడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు..రాబోయే రోజుల్లో ఈ వర్షాలు తమిళనాడు బార్డర్ లోని ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలకు కూడా పాకే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మిగతా రాయలసీమ జిల్లాల్లోనూ చిరుజల్లులు కురిసే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు.
సంక్రాంతి సమయంలో తమిళనాడుతో పాటు ఏపీలోని కొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ సూచనలను బట్టి అర్థమవుతోంది. శ్రీలంక సమీపంలోని నైరుతి బంగాళాఖాతంలో ప్రస్తుతం ఓ ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది… ఇది వచ్చేవారం అల్పపీడనంగా ఏర్పడే అవకాశాలున్నాయని హెచ్చరిస్తోంది వాతావరణ శాఖ. దీంతో జనవరి 10, 11, 12 తేదీల్లో డెల్టా, దక్షిణ తమిళనాడు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. సంక్రాంతి సమయంలో తమిళనాడులోనే కాదు ఆంధ్ర ప్రదేశ్ లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలున్నాయన్నమాట..
అల్పపీడనం బలపడితే మరింత భారీ వర్షాలు కురిసే అవకాశాలుంటాయి… కానీ ఇందుకు తక్కువ అవకాశాలున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. అంటే అల్పపీడనం వాయుగుండం, తుపానుగా మారే అవకాశాలు తక్కువని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ తుపాను ఏర్పడితే ఈ ప్రభావం తమిళనాడుపైనే కాదు ఆంధ్ర ప్రదేశ్ పైనా గట్టిగా ఉంటుంది.