ఘోర విమాన ప్రమాదం !…

డొమినికన్ రిపబ్లిక్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. అమెరికాలోని టెక్సాస్‌కు బయలుదేరిన గల్ఫ్‌స్ట్రీమ్ G200 ప్రైవేట్ జెట్ విమానం, సాంకేతిక లోపం కారణంగా లా రొమానా విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ అవుతుండగా రన్‌వేపై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందినట్లు సమాచారం…

ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న పైలట్, కో-పైలట్ అక్కడికక్కడే సజీవదహనమైనట్లు అధికారులు తెలిపారు. సమాచారం ప్రకారం, లా రోమనా ఎయిర్‌పోర్ట్‌లో విమానాన్ని సురక్షితంగా దించేందుకు పైలట్లు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ అది ఫలించలేదు.
ల్యాండింగ్ సమయంలో నియంత్రణ కోల్పోయిన బిజినెస్ జెట్ రన్‌వే పక్కకు దూసుకెళ్లి క్షణాల్లోనే భారీ శబ్దంతో పేలిపోయింది.
ప్రమాదం అనంతరం విమానంలోని ఇంధన ట్యాంకులకు మంటలు అంటుకోవడంతో అగ్నికీలలు వేగంగా వ్యాపించి విమానం పూర్తిగా నిప్పుల ముద్దగా మారింది..

అధికారుల సమాచారం ప్రకారం.. ఈ ప్రైవేట్ జెట్ విమానం డొమినికన్ రిపబ్లిక్‌లోని లా రొమానా విమానాశ్రయం నుండి అమెరికాలోని టెక్సాస్ నగరానికి బయలుదేరింది. అయితే టేకాఫ్ తీసుకున్న కొద్ది నిమిషాలకే, ఎయిర్‌పోర్ట్‌కు నైరుతి దిశగా 16 నాటికల్ మైళ్ల దూరంలో ప్రయాణిస్తున్న సమయంలో విమానంలో తీవ్రమైన సాంకేతిక సమస్య తలెత్తింది. దీనిని గమనించిన పైలట్లు తక్షణమే స్పందించి, అత్యవసర ల్యాండింగ్ కోసం తిరిగి లా రొమానా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకునేందుకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) అనుమతి కోరారు.

రన్‌వేపై అగ్నిగోళంగా మారిన గల్ఫ్‌స్ట్రీమ్ G200 విమానం..

అనుమతి లభించిన తర్వాత రన్‌వే 29పై ల్యాండ్ అవ్వడానికి పైలట్లు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ వేగంపై నియంత్రణ కోల్పోవడంతో విమానం రన్‌వే పక్కనే ఉన్న గడ్డి మైదానంలోకి దూసుకెళ్లింది. ఆ వెంటనే భారీ శబ్దంతో పేలిపోయి మంటల్లో చిక్కుకుంది. సమాచారం అందుకున్న వెంటనే ఎయిర్‌పోర్ట్ ఫైర్ అండ్ రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే, అప్పటికే తీవ్రంగా గాయపడిన పైలట్, కో-పైలట్ ఇద్దరూ మరణించినట్లు డొమినికన్ సివిల్ ఏవియేషన్ ఇనిస్టిట్యూట్ (IDAC) అధికారికంగా ప్రకటించింది..