అత్తాపూర్ కిడ్నాప్ కేసులో ట్విస్ట్..
కిడ్నాప్ అయిన యువతి తన నివాసంలో సురక్షితంగా ఉన్నట్లు గుర్తించిన పోలీసులు
కిడ్నాప్ అవ్వకముందు అత్తాపూర్ పరిధిలోని రత్నదీప్ సూపర్ మార్కెట్లో ఫోన్ పే ద్వారా వస్తువులు కొన్నట్టు గుర్తించి, ఆ నంబర్ ఆధారంగా యువతి మలక్ పేట్ వాస్తవ్యురాలిగా నిర్ధారణ
ఫోన్ నంబర్ ఆధారంగా ట్రేస్ చేసి యువతి ఇంట్లోనే సురక్షితంగా ఉన్నట్లు గుర్తించిన పోలీసులు..
హైదరాబాద్లో పెను సంచలనం రేపిన యువతి కిడ్నాప్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన ఈ కేసులో.. యువతి తన ఇంట్లోనే సేఫ్గా ఉండటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. యువతి ఫోన్ నంబర్ ఆధారంగా ఆమె ఆచూకీని కనుగొన్న పోలీసులు.. ఆమె ఇంట్లోనే ఉన్నట్లు గుర్తించారు. అర్ధరాత్రి అత్తాపూర్లో యువతి కిడ్నాప్ కావడం పెను సంచనలం రేపింది. థార్ కారులో వచ్చిన యువకులు.. అంతా చూస్తుండగానే.. బలవంతంగా యువతిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. పోలీసులు రంగంలోకి ఆ కారును ఛేజ్ చేసేందుకు ప్రయత్నాలు చేసినా సినిమా రేంజ్లో తప్పించుకుని పారిపోయారు. తాజాగా ఆ యువతి ఇంట్లోనే దొరకడంతో పోలీసులకు రకరకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అత్తాపూర్లో రాత్రి కిడ్నాప్ అయిన యువతి.. మలక్పేట్లోని తన ఇంట్లోనే సురక్షితంగా ఉండటంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అత్తాపూర్లోని జోయ్ ఆస్పత్రి వద్ద యువతి కిడ్నాప్ అయింది. థార్ కారులో వచ్చిన కొంతమంది వ్యక్తులు.. ఆ యువతిని బలవంతంగా కారులోకి ఎక్కించుకుని కిడ్నాప్ చేశారు. ఈ నేపథ్యంలోనే స్థానికుల ఫిర్యాదుతో క్షణాల్లో పోలీసులు రంగంలోకి దిగారు. ఆ థార్ కారును వెంబడించగా.. సినిమా స్టైల్లో పోలీసుల కళ్లు గప్పి వారు పరారయ్యారు. అయితే
ఆ థార్ నంబర్ ప్లేట్ లేకపోవడంతో వారిని గుర్తించడం పోలీసులకు కష్టంగా మారింది.ఈ క్రమంలోనే ఆ యువతి వివరాలను పోలీసులు సేకరించారు. జోయ్ ఆస్పత్రి హౌస్ కీపింగ్ సూపర్ వైజర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. ఆ దిశగా విచారణ చేపట్టారు. కిడ్నాప్ కావడానికి ముందు ఆ యువతి.. జోయ్ ఆస్పత్రి పక్కనే ఉన్న రత్నదీప్ సూపర్ మార్కెట్కు వెళ్లినట్లు గుర్తించారు. ఆమె అక్కడ కొన్ని వస్తువులు కొనుగోలు చేసి.. ఫోన్ పే ద్వారా పేమెంట్ చేసినట్లు తెలుసుకున్నారు.ఆ యువతి ఫోన్ నంబర్ ఆధారంగా ఆమెను ట్రేస్ చేశారు. మలక్పేట్కు చెందిన యువతిగా ఆమెను గుర్తించిన పోలీసులు.. అక్కడికి వెళ్లి చూడగా ఆమె ఇంట్లోనే ఉండటం చూసి షాక్ అయ్యారు. దీంతో అసలు ఏం జరిగింది అనే దాని గురించి ఆ యువతి నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. అయితే యువతికి ఎలాంటి హాని జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.