భారత్లో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీయులను గుర్తించి, వారిని స్వదేశానికి పంపడం గత కొన్ని సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్య..మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, అస్సాం, ఢిల్లీ, సూరత్ వంటి ప్రాంతాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఆధునిక సాంకేతికత (ఐరిస్ స్కానింగ్, బయోమెట్రిక్ డేటా) ఉపయోగించి విదేశీయులను గుర్తించడం వల్ల ఈ ప్రక్రియ వేగవంతమైంది. గతంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అక్రమ వలసలను ప్రోత్సహించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో నకిలీ పత్రాలు (ఆధార్, ఓటర్ కార్డులు) జారీ చేయడం, అక్రమ కార్యకలాపాలు వంటి సమస్యలు ఉన్నాయని కేంద్రం పేర్కొంటోంది. ఇప్పుడు ఈ చర్యలు తీవ్రతరం కావడంతో బంగ్లాదేశీయులు స్వచ్ఛందంగా తిరిగి వెళ్తున్నారు.
యుద్ధం ప్రకటించిన రాజకీయ, మతోన్మాద శక్తులు..
బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత రాజకీయ అస్థిరత పెరిగింది. ఈ నేపథ్యంలో జమాతే ఇస్లామీ వంటి సంస్థలు, కొన్ని విపక్ష శక్తులు మరింత చురుకుగా మారాయి. భారత్ డిపోర్టేషన్ చర్యలను వ్యతిరేకిస్తూ, సరిహద్దు ప్రాంతాల్లో ర్యాలీలు, ప్రకటనలు చేస్తున్నట్లు నివేదికలు వస్తున్నాయి. అయితే యుద్ధం ప్రకటించడం, కత్తులు, ఆయుధాలతో సిద్ధం కావడం వంటి ప్రకటనలు అధికారిక ప్రభుత్వ స్థాయిలో కాకుండా, విపక్షాలు, మతోన్మాద సంస్థల నుంచి వస్తున్నాయి. ఇవి రాజకీయ ఒత్తిడి సృష్టించడానికి లేదా తమ మద్దతు దారులను రెచ్చగొట్టడానికి చేస్తున్న ప్రకటనలుగా చాలా మంది విశ్లేషకులు భావిస్తున్నారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇలాంటి హింసాత్మక పిలుపులను మద్దతు ఇవ్వడం లేదు..