తుమకూరులో విచిత్ర ఘటన.. రూ.10 లక్షల నగలు మాయం.. దొంగ ఎలుకే!
కర్ణాటకలోని బెంగళూరు సమీపంలోని తుమకూరులో ఓ నగల దుకాణంలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. సుమారు రూ.10 లక్షల విలువైన బంగారు, వజ్రాభరణాలు కనిపించకుండా పోవడంతో షాపు యజమానులు ఆందోళనకు గురయ్యారు. దుకాణంలో దొంగతనం జరిగిందని భావించిన వారు వెంటనే సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు.
అయితే ఫుటేజ్లో కనిపించిన దృశ్యాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. నగలను దొంగిలించింది మనిషి కాదు.. ఓ ఎలుక. ఎలుక ఒక్కో నగను నోటితో పట్టుకుని తన బొక్కలోకి తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో స్పష్టంగా నమోదయ్యాయి.
దీంతో షాపు సిబ్బంది ఎలుక బొక్కను తవ్వి చూడగా అందులో నుంచి 10 బంగారు ఉంగరాలు, రెండు బంగారు గొలుసులు బయటపడ్డాయి. నగలన్నింటినీ తిరిగి స్వాధీనం చేసుకున్నారు.
సీసీటీవీ కెమెరాలు లేకపోయి ఉంటే ఈ ఘటనకు సంబంధించిన అసలు విషయం బయటపడేదే కాదని, ఏదో దొంగపై అనుమానాలు వెళ్లే అవకాశం ఉండేదని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.