బీసీ రిజర్వేషన్ల అంశంపై మంత్రిమండలిలో చర్చ…

సచివాలయంలో మంత్రివర్గ సమావేశం సుమారు 5 గంటల పాటు జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రధానంగా చర్చించారు. గవర్నర్‌ వద్దకు పంపిన ఆర్డినెన్స్‌ అంశం సమావేశంలో చర్చకు వచ్చింది. దీంతో పాటు ఎంబీబీఎస్ కౌన్సెలింగ్‌కు సంబంధించిన స్థానికత అంశంపై కూడా కేబినెట్‌లో చర్చించారు.

స్థానికత అంశంపై స్పష్టత కోసం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, సమావేశం మధ్యలోనే ఏజీ సుదర్శన్‌రెడ్డిని కలిసేందుకు వెళ్లారు. రాష్ట్ర విద్యార్థుల ప్రయోజనాలు కాపాడాలని ఏజీకి మంత్రి విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టులో ఈ మేరకు వాదనలు వినిపించాలని సూచించారు. అవసరమైతే సీనియర్ న్యాయవాదుల సహకారం తీసుకోవాలని మంత్రి కోరారు.

స్థానికులకే మెడికల్ సీట్లు దక్కేలా ప్రభుత్వం గతేడాది జీవో 33ను తీసుకొచ్చింది. అయితే స్థానిక కోటా సీట్లు తమకూ ఇవ్వాలని ఇతర రాష్ట్రాల్లో చదివిన విద్యార్థులు కోర్టును ఆశ్రయించారు. దీంతో స్థానికత అంశంపై సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. వచ్చేనెల 5న సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో సీఎం ఆదేశాల మేరకు మంత్రి, ఏజీని కలిసి, స్థానిక విద్యార్థుల ప్రయోజనాలు కాపాడాలని కోరారు..