బిహార్ ఎన్నికల ఫలితాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ సాధించిన విజయాన్ని సుపరిపాలన, అభివృద్ధి, ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం గెలుపుగా అభివర్ణించారు. అలాగే రాష్ట్ర ప్రజలకు, ఎన్డీఏ కార్యకర్తలకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌లో వరుస పోస్టులు పెట్టారు.
‘బిహార్ రాష్ట్రానికి సమగ్ర అభివృద్ధిని అందించింది ఎన్డీఏ. మా ట్రాక్ రికార్డు, మా దూరదృష్టి చూసిన ప్రజలు మాకు భారీ మెజారిటీ ఇచ్చారు. ప్రజలు ఇచ్చిన ఈ అద్భుతమైన తీర్పు ఎన్డీఏను మరింత బలపరుస్తుంది. బిహార్ కోసం కొత్త సంకల్పంతో పని చేసే శక్తిని ఇస్తుంది. భవిష్యత్తులో బిహార్‌ను కొత్త దిశగా తీసుకెళ్లేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. బిహార్ అభివృద్ధికి క్రియాశీలంగా పనిచేస్తాం. ఇక్కడి మౌలిక వసతులకు కొత్త గుర్తింపు తీసుకువస్తాం. యువతకు, మహిళలకు సుసంపన్నమైన జీవితానికి తగిన అవకాశాలు కల్పిస్తాం’ అని ప్రధాని మోదీ అన్నారు..