చేపలకు మేతగా బర్డ్ ఫ్లూ కోళ్లు!

AP: తూర్పు గోదావరిలో మరో ఘటన ప్రజలను

ఆందోళనకు గురిచేస్తోంది. బర్డ్ ఫ్లూతో చనిపోయిన కోళ్లను జగ్గంపేట, కిర్లంపూడి, ప్రత్తిపాడు, పెద్దాపురంలోని చెరువుల్లో చేపలకు ఆహారంగా ఇస్తున్నారు. దీంతో చేపలు తినాలా? వద్దా? అని జనాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అధికారులు దీనిపై దృష్టి సారించాలని కోరుతున్నారు…

సాధారణంగా చేపల చెరువుల నిర్వాహకులు చికెన్‌ షాపుల్లోని వ్యర్థాలను చేపలకు మేతగా వేస్తారు. కానీ, ఇప్పుడు బర్డ్‌ఫ్లూతో కోళ్లు పెద్ద సంఖ్యలో చనిపోతుండటంతో కోళ్లకు కోళ్లనే చేపలకు దానాగా వేస్తున్నారు. ఎలాగో బర్డ్‌ఫ్లూతో చనిపోయిన కోళ్లను పూడ్చిపెడుతున్నారాగా.. అదేదో మాకే ఇస్తే చేపలకు మేతగా వేసుకుంటాం అంటూ కోళ్ల ఫామ్‌ యజమానుల నుంచి చేపల చెరువుల నిర్వాహకులు తీసుకెళ్తున్నారు. ఇప్పటికే బర్డ్‌ఫ్లూతో తీవ్ర నష్టాలను చవిచూస్తున్న కోళ్ల ఫామ్‌ యజమానులకు.. చనిపోయిన కోళ్లను పూడ్చిపెట్టే పని తప్పుతుండటంతో వాళ్లు కూడా కోళ్ల తరలింపుకు ఓకే అంటున్నారు.

తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ తో చనిపోయిన కోళ్లను వ్యాన్ ల ద్వారా జగ్గంపేట, కిర్లంపూడి, ప్రత్తిపాడు,, పెద్దాపురం మండలాలకు తరలించి చెరువులలో చేపలకు మేతగా వేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే బర్డ్‌ఫ్లూతో చనిపోయిన కోళ్లను చెరువుల్లో చేపలకు మేత వేస్తుండటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోగంతో చనిపోయిన కోళ్లను.. చేపలు తింటే వాటికి కూడా ఆ వ్యాధి వచ్చే ప్రమాదం ఉంటుందని, వాటిని తింటే తమకు కూడా ప్రమాదమని భయపడుతున్నారు. వీటిపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కూడా ఎన్జీవో సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు..