అరుణాచల్‌లోని అప్పర్ సుభాన్‌సిరి లోయ, జరి, లుంగే ప్రాంతాల్లో కొత్తగా భవనాలు, రహదారులు నిర్మిస్తున్న చైనా..!
భారత భూభాగాలపై కన్నేసిన చైనా మెల్లమెల్లగా సరిహద్దుల్లోకి చొచ్చుకువస్తోంది.
అరుణాచల్ ప్రదేశ్‌లో సరిహద్దుకు సుమారు 20 కిలోమీటర్ల దూరంలోని ఒక మారుమూల గ్రామానికి చెందిన స్థానిక నివాసి టకోక్ మ్రా, ‘ది ఇండిపెండెంట్’తో ఫోన్లో మాట్లాడారు. చైనా మొత్తం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని “జాంగ్నాన్” లేదా “దక్షిణ టిబెట్” అని పిలుస్తూ, తన భూభాగంగా పేర్కొంటోంది. పరిస్థితి తీవ్ర స్థాయికి చేరితే చైనా సైన్యంతో పోరాడటానికి తాను సిద్ధంగా ఉన్నానని మ్రా చెప్పారు.
ముఖ్యంగా అరుణాచల్‌ప్రదేశ్‌లో వివాదం నెలకొని ఉన్న ప్రాంతాల్లోకి చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) దళాలు చొచ్చుకువస్తున్నాయి. 2022 నాటి, ప్రస్తుత ఉపగ్రహ చిత్రాలను పోల్చుతూ బ్రిటన్ వార్తా సంస్థ ఇండిపెండెంట్ దీనిపై ప్రత్యేక కథనం వెలువరించింది. భారత్‌లో బ్రిక్స్ సదస్సుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ హాజరైన సందర్భంలో ఈ అంశాన్ని తెరపైకి తేవడం గమనార్హం. విశ్లేషకుల అంచనా ప్రకారం.. ‘సలామీ స్లైసింగ్’ వ్యూహంతో చైనా సైన్యం ముందుకు వస్తోంది. అంటే ఒక్కసారిగా చొచ్చుకురాకుండా.. దశలవారీగా కొద్దికొద్దిగా చొచ్చుకువస్తూ, ఆ ప్రాంతంలో తమ దళాల ఉనికిని బలోపేతం చేసుకుంటోంది. అరుణాచల్‌లోని అప్పర్ సుభాన్‌సిరి లోయ, జరి, లుంగే ప్రాంతాల్లో కొత్తగా భవనాలు, రహదారులు నిర్మిస్తోంది. జూన్ నుంచి చైనా సైన్యం ముందుకు వస్తోందని, తాము వేటాడే, పశువులకు మేత తీసుకొచ్చే ప్రాంతాలకు వెళ్లకుండా అడ్డుకుంటోందని సరిహద్దు గ్రామాల్లోని గిరిజనులు చెబుతున్నారని ఇండిపెండెంట్ వెల్లడించింది. నిజానికి ఇటీవలికాలంలో చైనా దూకుడుపై ఇలాంటి ప్రచారం జరుగుతోంది. అదంతా ఉత్తిదేనని భారత సైన్యం పలుమార్లు ప్రకటించింది కూడా.