హైదరాబాద్‌లోని మౌలాలీ (Moulali) సమీపంలో తప్పిన ప్రమాదం

హైదరాబాద్‌లోని మౌలాలీ (Moulali) సమీపంలో ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. విజయవాడ నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ (Intercity Express) రైలుపై విద్యుత్ తీగలు తెగిపడటంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. విజయవాడ వైపు నుంచి వస్తున్న ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ మౌలాలీ ప్రాంతానికి చేరుకునే సమయంలో అకస్మాత్తుగా ఓవర్ హెడ్ ఎలక్ట్రిక్ వైర్లు తెగి రైలు ఇంజిన్, బోగీలపై పడ్డాయి. ఆ సమయంలో భారీ శబ్దాలు రావడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందారు. ప్రాణభయంతో రైలు దిగి పరుగులు తీశారు. అయితే, అప్రమత్తమైన లోకో-పైలట్ (Loco Pilot) వెంటనే రైలును నిలిపివేయడంతో పెద్ద ముప్పు తప్పింది. ఈ ఘటనలో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు..