గద్వాల్, అలంపూర్, పాలమూరు ప్రాంతాల్లో ‘రాజోలిబండ డైవర్షన్ స్కీమ్’లో భాగంగా తమకు కేటాయించిన 15 టీఎంసీల నీటిని పూర్తిస్థాయిలో వాడుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం తుంగభద్ర కింద కేవలం 5 టీఎంసీలను మాత్రమే వినియోగించుకోగలుగుతున్నామన్న రేవంత్.. మిగిలిన 10 టీఎంసీల నీరు అందడం లేదని చెప్పారు…
కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్ర ప్రాజెక్టుకు ఏర్పాటు చేసిన 33 కొత్త గేట్లను కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. మూడు రాష్ట్రాల జలవనరుల శాఖ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. 2024 ఆగస్టులో వచ్చిన వరద ప్రవాహానికి తుంగభద్ర ప్రాజెక్టు 19వ గేటు కొట్టుకుపోయింది. అనంతరం నిపుణుల కమిటీ చేసిన సూచనల మేరకు రూ.51 కోట్ల వ్యయంతో మొత్తం 33 కొత్త గేట్లను అమర్చారు.
నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం రావాలి .
ప్రారంభోత్సవం అనంతరం నిర్వహించిన సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాట్లాడారు. తుంగభద్ర నది ఒడ్డున బళ్లారిలో జరిగిన ఈ సమావేశం అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపించే వేదిక కావాలని ఆకాంక్షించారు. “తుంగభద్ర గేట్ల పునరుద్ధరణ చరిత్రలో నిలిచిపోతుంది. మూడు తరాలుగా కొనసాగుతున్న సమస్యలకు 33 గేట్ల పునరుద్ధరణతో పరిష్కారం దొరుకుతుంది. బళ్లారి, కర్నూలు, అనంతపురం, పాలమూరు ప్రాంతాల నీటి సమస్యలు తీరతాయి. తక్కువ మాట్లాడి అత్యంత వేగంగా పనిచేయడం సీఆర్ పాటిల్ ప్రత్యేకత. ఆయన కేంద్ర జలశక్తి శాఖ మంత్రిగా ఉండటంతో ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో సాగు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పూర్తి విశ్వాసం ఉంది” అని చెప్పారు. నీటి సమస్యలు పరిష్కారం కాకపోవడంతో విలువైన నీరు సముద్రంలో కలిసిపోతోందని సీఎం పేర్కొన్నారు. రాజోలిబండ డైవర్షన్ స్కీంలో పాలమూరుకు కేటాయించిన 15 టీఎంసీల నీటిలో ప్రస్తుతం కేవలం 5 టీఎంసీలు మాత్రమే వినియోగించగలుగుతున్నామని వివరించారు.