కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే దీపావళి వేడుకను ఈద్‌ ఆఫ్‌ జాయ్‌గా అభివర్ణించడం తీవ్ర రాజకీయ వివాదం..!

కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే దీపావళి వేడుకను ఈద్‌ ఆఫ్‌ జాయ్‌గా అభివర్ణించడం తీవ్ర రాజకీయ వివాదానికి కారణమైంది…కాంగ్రెస్‌ పార్టీ తన బుజ్జగింపు రాజకీయాలతో హిందువుల మనోభావాలను దెబ్బతీసిందంటూ బీజేపీ తీవ్రంగా మండిపడింది. చేతనైతే ఈద్‌ను దివాలీ ఆఫ్‌ జాయ్‌ అనండంటూ సవాల్‌ విసిరింది. హిందువుల సంప్రదాయాలు, పండుగలంటే కాంగ్రెస్‌కు నచ్చదంటూ వీహెచ్‌పీ సైతం వ్యాఖ్యానించింది.

కాంగ్రెస్‌ ఈ విమర్శలను దీటుగా తిప్పికొట్టింది. ఈద్‌కు అసలు అర్థం పండుగ అని, భాషాపరమైన అవగాహన లేని వారు మాత్రమే ఖర్గే వ్యాఖ్యలను తప్పుపడతారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు రోజుల క్రితం జరిగిన మీడియా సమావేశంలో కాంగ్రెస్‌ చీఫ్‌ ఖర్గే దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో ఒకటైన దీపావళిని ఆయన ఖుషియోం కా ఈద్‌ (సంతోషాల పండుగ)గా అభివర్ణించారు.

ఇదే వివాదానికి కారణమైంది. బీజేపీ ప్రతినిధి గౌరవ్‌ భాటియా ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ. హిందువుల మతపరమైన వేడుకలు, పండుగలను అవమానించడం కాంగ్రెస్‌కు అలవాటైపోయిందంటూ విమర్శించారు. ఆ పార్టీ డీఎన్‌ఏలోనే ఇది ఉందన్నారు. ముస్లింలను బుజ్జగించే ప్రయత్నాల్లో భాగంగానే ఇలాంటి హిందూ వ్యతిరేక, సనాతన వ్యతిరేక వ్యాఖ్యలకు పాల్పడుతోందన్నారు..