ఆభరణాలు , కడియాల కోసం గొంతు కోసి…కాళ్లను నరికి…!

చేవెళ్ల గడ్డపై కన్నీటి గాయం!..కడియాల కోసం కడతేర్చిన కసాయిలు…

గొంతు కోసి…కాళ్లను నరికి..!

*మానవత్వం..సమాజమా.. ఎటుపోతోంది నీ గమ్యం?

కడియాల కోసం ..తల్లి లాంటి మహిళను చంపేశారే..పసిడి కమ్మలకై…ప్రాణాలనే తీసేశారే! చేవెళ్ల గడ్డపై…చీకటి రాత్రి కన్నీరు కార్చేనే…ఆభరణాల ఆశల ముందు…మానవత్వం మృత్యువాత పడింది..
నడిచిన కాళ్ళను నరికేసిన మృగత్వంచూసి చలించిపోతోంది మానవత్వం..సమాజమా! ఎటుపోతోంది నీ గమ్యం?పసిడి కాంక్ష ముందు ప్రాణం అంత చులకనా?…

ఆభరణాల కోసం ఓ మహిళను దారుణంగా హత్య చేసిన సంఘటన చేవెళ్ల మండలంలోని ఈర్లపల్లి సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గొల్లపల్లి అనుబంధ గ్రామమైన ధర్మసాగర్‌కు చెందిన ఎరుకుల మైసమ్మ(48)కు ముప్పై ఏళ్ల కిందట వివాహమైంది.
అనంతరం కొన్నేళ్లకు ఆమె భర్త చనిపోయాడు. దీంతో కొడుకు సురేశ్‌తో కలిసి ఆమె ధర్మసాగర్‌లోనే ఉంటుంది. కొడుకుకి వివాహం కావటంతో వేర్వేరుగా ఉంటున్నారు. మైసమ్మ కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తుంది. మంగళవారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. బుధవారం మధ్యాహ్నం ఈర్లపల్లి సమీపంలో ఓ మహిళ మృతదేçహాన్ని గుర్తించినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

*నిర్మానుష్య ప్రదేశంలోని తీసుకెళ్లి..?*

ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించి మైసమ్మగా నిర్ధారించారు. దుండగులు ఆమెను నిర్మానుష్య ప్రదేశంలోని తీసుకెళ్లి గొంతు కోసి రెండు కాళ్లను నరికి 50 తులాల కడియాలు, చెవి కమ్మలు దోచుకెళ్లారు. తాగిన మైకంలో ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ భూపాల్‌శ్రీధర్‌ తెలిపారు. దర్యాప్తులో మరిన్ని విషయాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయని చెప్పారు.