బలవంతంగా గృహ ప్రవేశాలు చేయించారనే ఆరోపణలు..
ధర్మానతో పాటు మరో ఏడుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు. గృహనిర్మాణ శాఖ డీఈఈ ఫిర్యాదుతో పోలీసుల చర్యలు. హుద్హుద్ బాధితుల ఇళ్ల పంపిణీలో వివాదం
శ్రీకాకుళం: వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుపై శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇళ్లలోకి బలవంతంగా ప్రవేశించారన్న ఆరోపణల నేపథ్యంలో శనివారం ధర్మాన ప్రసాదరావుతో పాటు మరో ఏడుగురిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
గృహనిర్మాణ శాఖ శ్రీకాకుళం డీఈఈ వి.వి. సత్యాజీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై కరణం సురేశ్ తెలిపారు. హుద్హుద్ తుపాను బాధితులైన మత్స్యకార కుటుంబాల కోసం ప్రభుత్వం గతంలో ఇళ్లను నిర్మించింది. ఇళ్ల పంపిణీ సమయంలో కొంతమంది లబ్ధిదారులు అందుబాటులో లేకపోవడంతో ఆయా ఇళ్లను ఖాళీగా ఉంచినట్లు అధికారులు తెలిపారు.
ఈ నేపథ్యంలో వారికి ఆ ఇళ్లను కేటాయించాలని కోరుతూ వైసీపీకి చెందిన కొందరు మత్స్యకారులు గతంలో కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. అయితే, గత మే 14న మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, జడ్పీటీసీ సభ్యురాలు రుప్పా దివ్యతో పాటు మరో ఆరుగురు మత్స్యకారులు నిబంధనలకు విరుద్ధంగా ఆయా ఇళ్లలోకి ప్రవేశించారని డీఈఈ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
డీఈఈ ఫిర్యాదు ఆధారంగా మొత్తం ఎనిమిది మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఎస్సై సురేశ్. ఈ ఘటనపై స్థానికంగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.