ఈరోజుల్లో సినీ పరిశ్రమలో నిర్మాతకు విలువలేదు…

ప్రముఖ సినీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌, శ్రీ వెంకటేశ్వర సినీ పరిశ్రమ క్రియేషన్స్, దిల్ రాజు డ్రీమ్స్ సినీ నిర్మాణ సంస్థల అధినేత దిల్ రాజు, నేడు ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, “ఈరోజుల్లో సినీ పరిశ్రమలో నిర్మాతకు విలువలేదు… నిర్మాత అంటే ఇచ్చేవాడు. మిగిలిన వాళ్ళందరూ కూడా పుచ్చుకునేవాళ్ళే. కానీ ఆ పుచ్చుకునేవాళ్ళే నిర్మాతలని, సినీ పరిశ్రమని ఇప్పుడు శాశిస్తున్నారు. ఒకప్పుడు నిర్మాత అంటే సినీ పరిశ్రమలో ప్రతీ ఒక్కరికీ చాలా గౌరవం ఉండేది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. పుచ్చుకునేవాళ్ళు ఎలా ఆడిస్తే మేము అలా ఆడాల్సిందే. లేకుంటే చాలా కష్టం,” అని అన్నారు.

ఇది చాలా బాధాకరమైన స్టేట్‌మెంట్‌ కానీ వాస్తవమేనని సినీ పరిశ్రమలో ఉన్నవారికి, దాంతో సంబంధం ఉన్నవారికీ బాగా తెలుసు. సినిమా ఆడి లాభాలు వస్తే పర్వాలేదు. కానీ ఆడకపోతే ఒక్క నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లు మాత్రమే నష్టపోతారు. అయినా ఏమీ జరగనట్లు చిరునవ్వులు చిందిస్తూ మరో సినిమాకి సిద్ధం కాకతప్పదు.

సీనియర్ నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు 90వ జన్మదినోత్సవ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, పూర్ణచంద్రరావు నిర్మించిన 87 చిత్రాలు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచాయని కొనియాడారు.

అట్లూరి సమర్పణలో తాను ఒక విలువలతో కూడిన సినిమా నిర్మిస్తానని ప్రకటించిన దిల్ రాజు, తన తొలి సినిమా ‘దిల్’ హిందీ రీమేక్ హక్కులను అట్లూరి అడిగిన సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.