డూమ్స్‌డే వార్‌'(Doomsday War)ప్రళయం తరహా) స్థాయికి చేరినా ఎదుర్కొనేందుకు సిద్ధం అని అమెరికాను హెచ్చరించిన ఇరాన్..!..

మరోసారి ఉద్రిక్తంగా మారుతున్నాయి. హర్ముజ్‌ జలసంధిని తిరిగి తెరిచేందుకు ఇరాన్‌ ప్రతిపాదించిన ఏడు రోజుల రోడ్‌మ్యాప్‌ను అమెరికా తిరస్కరించడంతో..అవసరమైతే భయానక యుద్ధాన్ని సైతం ఎదుర్కొనేందుకు తమ దేశం పూర్తిగా సిద్ధంగా ఉందని ఇరాన్‌ అంటోంది.

ఈసారి యుద్ధం మొదలైతే అదీ ఎవరూ ఊహించని స్థాయిలో భీకరంగా మారొచ్చు అని ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాఘ్చీ స్పష్టం చేశారు. యుద్ధం పునఃప్రారంభమైతే అది ‘డూమ్స్‌డే వార్‌'(Doomsday War)ప్రళయం తరహా) స్థాయికి చేరినా ఎదుర్కొనేందుకు సిద్ధం అని అమెరికాను హెచ్చరించారాయన. అదే సమయంలో దౌత్యానికి తలుపులు మాత్రం మూసివేయలేదని చెప్పారు.

హర్ముజ్‌ జలసంధిని తిరిగి తెరవడం, యుద్ధాన్ని ముగించే దిశగా ఇరాన్‌ ఏడు రోజుల ప్రణాళికను ప్రతిపాదించింది. అయితే ఈ ప్రతిపాదనను అమెరికా తిరస్కరించింది. ఇరాన్‌ తమను ఫ్రీజ్‌ చేసిన బిలియన్ల డాలర్ల నిధులను విడుదల చేయాలని, ఆంక్షలను ఎత్తివేయాలని కోరిందని.. అందుకు తాము సిద్ధంగా లేమని ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి మైక్‌ వాల్ట్జ్‌ తెలిపారు. ఇవి కేవలం అమెరికా విధించిన ఆంక్షలు కాదని, ప్రపంచవ్యాప్తంగా అమల్లో ఉన్న ఆంక్షలని ఆయన పేర్కొన్నారు.

‘యుద్ధం త్వరలో ముగుస్తుంది’.. ట్రంప్‌
మరోవైపు.. ఆరాఘ్ఛి వార్నింగ్‌ వెలువడ్డ కాసేపటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక ప్రకటన చేశారు. ఈ వారంలో ఇరాన్‌తో మరిన్ని చర్చలు జరిగే అవకాశం ఉందని చెప్పారు. యుద్ధంలో అమెరికా ‘త్వరలోనే విజయం సాధిస్తుంది’ అని ఆయన పేర్కొన్నారు. అయితే ఇరాన్‌ ప్రతిపాదనను తిరస్కరించినప్పటికీ దౌత్య మార్గాలు పూర్తిగా మూసుకుపోలేదని నిపుణులు చెబుతున్నారు…న్యూయార్క్‌లో ఐరాస సర్వసభ్య సమావేశాల సందర్భంగా ఇరాన్‌ ప్రతినిధులతో దౌత్య ప్రయత్నాలు కొనసాగుతున్నాయని సెంటర్‌ ఫర్‌ మిడిల్‌ ఈస్ట్‌ స్ట్రాటజిక్‌ స్టడీస్‌ సీనియర్‌ పరిశోధకుడు అబ్బాస్‌ అస్లానీ తెలిపారు. మధ్యవర్తుల ద్వారా అమెరికా అధికారిక స్పందన కోసం ఇరాన్‌ ఎదురుచూస్తోందని చెప్పారు. ఇరుదేశాలు తమకు ఉన్న ప్రధాన ఒత్తిడి సాధనాలను ముందుగా ఎవరు వదులుకుంటారన్నదే ఇప్పుడు కీలకంగా మారిందని ఆయన విశ్లేషించారు.

డ్రోన్‌ స్వాధీనం చేసుకున్నామన్న ఇరాన్‌ ప్రకటనపై..
హర్ముజ్‌ జలసంధిలో అమెరికాకు చెందిన అధునాతన అండర్‌వాటర్‌ డ్రోన్‌ను ఇరాన్‌ సైన్యం స్వాధీనం చేసుకుందన్న వార్తలు కూడా ఉద్రిక్తతను పెంచాయి. అయితే ఇరాన్‌ చేసిన ఈ ప్రకటనను అమెరికా సైన్యం ఖండించింది. డ్రోన్‌ తమ ఆధీనంలోకి వెళ్లిందన్న వాదనలో వాస్తవం లేదని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. ఇరాన్‌పై అమెరికా దాడులకు ఉపయోగిస్తున్న బ్రిటన్‌లోని ఓ వైమానిక స్థావరం సమీపంలో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. పేలుడు పదార్థాలు, ఉగ్రవాదానికి సంబంధించిన నేరాల అనుమానంతో వారిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. వాళ్లు ఇరాన్‌ పౌరులని తెలుస్తోంది..నస్రల్లా హంతకుల్ని శిక్షించాల్సిందే
మరోవైపు హెజ్బొల్లా నేత హసన్‌ నస్రల్లా హత్యకు రెండేళ్లు పూర్తైన సందర్భంగా ఇరాన్‌ మరోసారి ఇజ్రాయెల్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది. నస్రల్లా హత్యను ‘క్షమించరాని నేరం’గా అభివర్ణించిన ఇరాన్‌ విదేశాంగ శాఖ.. బాధ్యులను గుర్తించి చట్టపరంగా శిక్షించాలని ప్రపంచ దేశాలను కోరింది. 2024 సెప్టెంబర్‌ 27న బీరుట్‌లోని దక్షిణ శివార్లపై ఇజ్రాయెల్‌ జరిపిన వైమానిక దాడిలో నస్రల్లా మరణించిన విషయం తెలిసిందే.

మొత్తంగా హర్ముజ్‌ జలసంధి తెరవడం, ఆంక్షల ఎత్తివేత, అణు కార్యక్రమం వంటి అంశాలపై అమెరికా-ఇరాన్‌ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఒకవైపు చర్చలకు అవకాశం ఉందన్న సంకేతాలు కనిపిస్తుండగా.. మరోవైపు యుద్ధం మళ్లీ మొదలైతే పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నామని ఇరాన్‌ హెచ్చరించడం పరిస్థితి తీవ్రతను చాటుతోంది…

డూమ్స్‌డే వార్’ (Doomsday War) అంటే ప్రపంచ వినాశనానికి లేదా యుగాంతానికి దారితీసే అత్యంత భయంకరమైన యుద్ధం లేదా దాడులు అని అర్థం…