*ఏసీబీకి చిక్కిన సూర్యాపేట డిఎస్పి, పట్టణ సీఐ*
*కేసులో రిమాండ్ చేయకుండా ఉండడానికి 25 లక్షల రూపాయలు డిమాండ్ 16 లక్షలకు కుదిరిన డీల్*
మెడికల్ కేసుకు సంబంధించి 25 లక్షల రూపాయలు లంచంగా డిమాండ్ చేసి 16 లక్షలకు డీల్ కుదుర్చుకున్న కేసులో సూర్యాపేట డిఎస్పీ కే.పార్థసారథి, పట్టణ సీఐ పి. వీరరాఘవులను సోమవారం సాయంత్రం ఏసీబీ అధికారులు ట్రాప్ చేసి పట్టుకున్నారు. ఏసీబీ హైదరాబాద్ రేంజ్ ఏఎస్పి కమలాకర్ రెడ్డి, ఏసిపి జగదీష్ చందర్, ఏసీబీ నల్గొండ యూనిట్ అధికారులు సంయుక్తంగా సోమవారం సాయంత్రం సూర్యాపేట డిఎస్పీ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం డిఎస్పీ కార్యాలయం వద్ద ఏసీబీ అధికారులు విలేకరులకు విషయాలను వివరించారు. సూర్యాపేట పట్టణ పరిధిలో క్రైమ్ నెంబర్ 166/2005 కేసు కు సంబంధించి స్కానింగ్ సెంటర్ నిర్వాహకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. ఈ కేసులో ఫిర్యాదు దారుని అరెస్టు చేయకుండా, రిమాండ్ చేయకుండా ఉండడానికి గాను పట్టణ సీఐ ఫిర్యాదుదారున్ని డిఎస్పీతో మాట్లాడాలని చెప్పగా ఫోన్ సంభాషణ ద్వారా 25 లక్షల రూపాయలు మొదటగా డిఎస్పి, సీఐ డిమాండ్ చేశారని, ఈ విషయాన్ని ఫోన్ సంభాషణ ద్వారా నిర్ధారణ చేసుకున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు. తదుపరి ఫోన్ సంభాషణల ద్వారా 16 లక్షల రూపాయలు ఇవ్వడానికి పోలీసులు, ఫిర్యాదుదారుడు పరస్పరం అంగీకరించుకున్నారు. అనంతరం ఫిర్యాదుదారుడు తన వద్ద అంత డబ్బులు లేవని చెప్పడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించడం జరిగిందన్నారు. సూర్యాపేట డిఎస్పి, కస్టడీలోకి తీసుకున్నామని, కోర్టు ముందు హాజరు పరుస్తామని ఏసీబీ అధికారులు వివరించారు. ఎవరైనా ప్రభుత్వ అధికారి, ఉద్యోగులు లంచం డిమాండ్ చేసినట్లయితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064 ను సంప్రదించాలని ఏసీబీ అధికారులు చెప్పారు. అంతేకాకుండా ఏసీబీ తెలంగాణ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో వాట్సాప్ నెంబర్ 94404 46106 , ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని, ఫిర్యాదు దారిన వివరాలు గోప్యంగా ఉంచబడతాయని చెప్పారు..
వార్త సేకరణ..Saida..