అప్ఘానిస్థాన్, మణిపూర్, పశ్చిమబెంగాల్ ప్రాంతాల్లో భూ ప్రకంపనలు..!

జపాన్ దేశాన్ని వణికించిన భూకంపం ఘటన మరవక ముందే మళ్లీ బుధవారం అప్ఘానిస్థాన్, మణిపూర్, పశ్చిమబెంగాల్ ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. వరుస భూకంపాలతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. అప్ఘానిస్థాన్ దేశంలోని ఫయాజాబాద్ ప్రాంతంలో బుధవారం అర్దరాత్రి సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ తెలిపింది..ఫైజాబాద్ నగరానికి 126కిలోమీటర్ల దూరంలో 80 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. బుధవారం రాత్రి మొదటిసారి భూమి కంపించింది.

ఫైజాబాద్ నగరానికి 100 కిలోమీటర్ల దూరంలో బుధవారం రాత్రి రెండోసారి సంభవించిన భూకంపం 4.8గా నమోదైంది. రెండు సార్లు వచ్చిన వరుస భూకంపాలతో అప్ఘాన్ ప్రజలు వణికిపోయారు..మణిపూర్ రాష్ట్రంలోని ఉఖ్రూల్ ప్రాంతంలో బుధవారం అర్దరాత్రి 12.01 గంటలకు భూకంపం వచ్చింది. 26 కిలోమీటర్ల లోతుల్లో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ తెలిపింది. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని అలీపూర్ దూర్ జిల్లాలో 5 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చింది. ఒకేరోజు నాలుగు వరుస భూకంపాలతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు…