దీపావళి వేడుకల సందర్భంగా జరిగిన పలు అగ్నిప్రమాదాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. రాజస్థాన్, ఢిల్లీ, పుణె, ముంబై, జమ్ము, నాగ్‌పూర్, గ్యాంగ్‌టక్ తదితర ప్రాంతాల్లో టపాసుల కారణంగా చెలరేగిన అగ్నిప్రమాదాలలో పలువురు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయపడ్డారు….దుకాణాలు, వాణిజ్య సముదాయాలు, నివాస భవనాలు అగ్నికి ఆహుతై భారీగా ఆస్తినష్టం వాటిల్లింది. ఒక్క పుణె నగరంలోనే దీపావళి రోజున 63 అగ్నిప్రమాదాలు సంభవించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
రాజస్థాన్‌లోని పాలి జిల్లా ఫాల్నాలో జరిగిన ఘోర ప్రమాదంలో టపాసుల దుకాణం పూర్తిగా దగ్ధమై ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, ముగ్గురు గల్లంతయ్యారు. రోడ్డుపై కాలుస్తున్న టపాసుల నిప్పు రవ్వలు దుకాణంపై పడటంతో ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. అలాగే ఢిల్లీలోని నరేలాలో టపాసుల పండుగ విషాదంగా మారింది. చిన్నారి టపాసులు కాలుస్తుండగా దూసుకొచ్చిన రాకెట్ నేరుగా కడుపులోకి దూసుకెళ్లడంతో 10 ఏళ్ల బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. నాగ్‌పూర్‌లోని ఓ టీవీఎస్ షోరూమ్‌లో, సిక్కిం గ్యాంగ్‌టక్‌లోని ప్రభుత్వ క్వార్టర్స్‌లో, ఉత్తరప్రదేశ్‌లోని బాండాలో స్క్రాప్ షాప్‌లోనూ టపాసుల కారణంగా భారీ అగ్నిప్రమాదాలు జరిగాయి.మహారాష్ట్రలోని ముంబై, పుణె, థానేలలో కూడా పెద్ద ఎత్తున అగ్నిప్రమాదాలు నమోదయ్యాయి. ముంబైలోని డాంగ్రీ ప్రాంతంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో పలు దుకాణాలు, గుడిసెలు కాలిపోయాయి. అంధేరిలోని లోఖండ్వాలా హైరైజ్ బిల్డింగ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా, థానేలోని 17 అంతస్తుల భవనంలోనూ ప్రమాదం చోటుచేసుకుంది. జమ్ములోని చరిత్రాత్మక నెహ్రూ మార్కెట్లోనూ పెద్ద ఎత్తున మంటలు చెలరేగి దాదాపు డజనుకు పైగా దుకాణాలు దగ్ధమయ్యాయి. బాణాసంచా కాలుస్తున్న సమయంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, తగు జాగ్రత్తలు పాటించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.