రకాలను బట్టి గరిష్ట ధరలు ఇవే…

రాష్ట్రంలో ఎగిసిపడుతున్న బియ్యం ధరల మంటపై తెలంగాణ ప్రభుత్వం అత్యంత తీవ్రంగా స్పందించింది. మార్కెట్‌లో బియ్యం కొరత ఉందంటూ జరుగుతున్న ప్రచారాన్ని పౌరసరఫరాల శాఖ తీవ్రంగా ఖండించింది. కృత్రిమ కొరత సృష్టించి సామాన్యుల జేబులకు చిల్లులు పొడుస్తున్న వ్యాపారుల ఆటకట్టించేందుకు నేరుగా రంగంలోకి దిగింది. వివిధ రకాల బియ్యం విక్రయాలపై గరిష్ట ధరల పరిమితిని (Maximum Retail Price) నిర్ణయిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.

రకాలను బట్టి గరిష్ట ధరలు ఇవే.

ప్రజలపై అదనపు భారం పడకుండా ఉండేందుకు రకాలను బట్టి కిలో బియ్యం గరిష్ట ధరలను ప్రభుత్వం ఖరారు చేసింది. బీపీటీ (BPT), కేఎన్ఎమ్ (KNM) రకం బియ్యం కిలో గరిష్ట ధర రూ.66 గా నిర్ణయించింది. అలాగే ఎంతో ఆదరణ ఉన్న ఆర్‌ఎన్‌ఆర్ (RNR), తెలంగాణ సోనా రకం బియ్యం కిలో రూ.74కు మించకూడదని స్పష్టం చేసింది. ఇక హెచ్‌ఎమ్‌టీ (HMT), జేఎస్ఆర్ (JSR) రకం బియ్యం కిలో గరిష్ట ధర రూ.79గా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయించిన ఎంఆర్‌పీ కంటే ఒక్క రూపాయి ఎక్కువకు విక్రయించినా కఠిన చర్యలు తప్పవని తేల్చిచెప్పింది.

నకిలీ స్టిక్కర్లు, మోసాలపై నిఘా.. పీడీ యాక్ట్ హెచ్చరిక..

అక్రమ సంపాదన కోసం వ్యాపారులు చేస్తున్న కొత్త రకం మోసాలపై పౌరసరఫరాల శాఖ ఆరా తీసింది. 25 కిలోల బియ్యం బస్తాపై 26 కిలోల స్టిక్కర్ వేసి విక్రయిస్తున్న అక్రమార్కులపై ప్రత్యేక దృష్టి సారించింది. అంతేకాకుండా, అసలు ఎంఆర్‌పీ ధరలపై ఎక్కువ రేట్లు ఉన్న నకిలీ స్టిక్కర్లను అతికించి అమ్ముతున్న వారిపై రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేసింది. బియ్యం అక్రమ నిల్వలు ఉంచినా, బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడినా ఉపేక్షించేది లేదని.. పదేపదే నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారులపై ఏకంగా పీడీ యాక్ట్ (PD Act) ప్రయోగిస్తామని ప్రభుత్వం ఘాటుగా హెచ్చరించింది.