ఎగ్ నూడుల్స్ ని మించిన టేస్ట్ తో “కోడిగుడ్డు సేమియా” – ఇలా చేస్తే పొడి పొడిగా!
“ఎగ్ సేమియా” చేసుకోండి. ప్రొటీన్ రిచ్ ఫుడ్ గా, హెల్దీగా మారిపోతుంది. టేస్ట్ విషయానికొస్తే ఎగ్ నూడుల్స్ ని మించిన రుచితో కిర్రాక్ గా ఉంటుంది. పిల్లలైతే మమ్మీ ఇంకొంచం కావాలంటూ అడిగి మరీ తింటారు. ఇది బ్రేక్ఫాస్ట్ లోకి మాత్రమే కాకుండా ఈవెనింగ్ స్నాక్ గా కూడా అద్దిరిపోతుంది. పైగా దీన్ని తయారు చేసుకోవడం చాలా ఈజీ. మరి, ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
తీసుకోవాల్సిన పదార్థాలు :
సేమియా – ఒక కప్పు.
ఆయిల్ – ఒక టీస్పూన్
ఉప్పు – కొద్దిగా
తయారీ విధానమిలా ..
ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని 1 టీస్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆపై అందులో సేమియాను వేసి కొంచం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
కాస్త ఆయిల్ వేసి వేయించుకోవడం వల్ల సేమియా అనేది ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటుంది.
అనంతరం అదే పాన్లో మూడు కప్పుల వరకు వాటర్, ఉప్పు వేసుకొని మరిగించుకోవాలి.నీళ్లు కాస్త మరిగిన తర్వాత ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న సేమియాను వేసి మధ్య మధ్యలో కలుపుతూ మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
అంటే, సేమియా అనేది మరీ మెత్తగా ఉడకకుండా 70 నుంచి 80 శాతం ఉడికితే సరిపోతుంది.అలా ఉడికిందని ఎలా తెలుసుకోవాలంటే, గరిటెతో కొద్దిగా తీసుకొని చేతితో తుంచితే ఈజీగా కట్ అయిపోవాలి. అంతేకానీ, పేస్ట్ లా అవ్వొద్దని గుర్తుంచుకోవాలి.
ఆవిధంగా ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్ చేసుకున్న సేమియాను జాలి గంటెలో(స్టెయినర్) వేసి అదనపు వాటర్ ను వడకట్టుకోవాలి.
ఆ తర్వాత వెంటనే స్టెయినర్లోనే ఉన్న సేమియాను ఒకసారి నార్మల్ వాటర్తో కడిగి పక్కన పెట్టుకోవాలి. లేదంటే ఆ వేడికి సేమియా మరింత మెత్తగా అవుతుందని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఎగ్ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవాలి.
ఎగ్ ఫ్రై కోసం :
నూనె – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు
కోడిగుడ్లు- 3
పసుపు – చిటికెడు
కారం – అర టీస్పూన్
మిరియాల పొడి – పావుటీస్పూన్
అందుకోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని నూనె వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఎగ్స్ ని పగులకొట్టి పోసుకోవాలి.
ఆపై అందులో పసుపు, కారం, మిరియాల పొడి వేసుకోవాలి.ఇవి వేసుకున్నాక వెంటనే కదపకుండా ఒక నిమిషం పాటు అలాగే ఉడకనివ్వాలి.
ఆ తర్వాత గరిటెతో స్లోగా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి.అయితే, ఎగ్ మిశ్రమాన్ని మిక్స్ చేసుకునేటప్పుడు మరీ చిన్న ముక్కలుగా కాకుండా కాస్త పెద్ద సైజ్ ముక్కలుగా ఉండేలా కట్ చేసుకొని కలుపుతూ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి.
తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఎగ్ సేమియాని తయారు చేసుకోవాలి.
సేమియా ఎగ్ ఫ్రై కోసం :
నూనె – 2 టేబుల్ స్పూన్లు
వెల్లుల్లి రెబ్బలు – 6 నుంచి 7
చిన్నసైజ్ ఉల్లిపాయ – ఒకటి
క్యారెట్ తరుగు – కొద్దిగా
పచ్చిమిర్చి తరుగు – 2 టేబుల్ స్పూన్లు
క్యాప్సికం ముక్కలు – కొన్ని
ఉప్పు, కారం – రుచికి తగినంత
మిరియాల పొడి – కొద్దిగా
కొత్తిమీర తరుగు – కొద్దిగా
అనంతరం స్టవ్ మీద అదే పాన్లో నూనె వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పొట్టు తీసిన వెల్లుల్లి సన్నని తరుగు వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి.
అవి వేగాక అందులో సన్నని ఉల్లిపాయ, క్యారెట్, పచ్చిమిర్చి తరుగు, క్యాప్సికం ముక్కలు వేసి హై ఫ్లేమ్ మీద ఒక నిమిషం పాటు కలుపుతూ వేయించుకోవాలి.
కూరగాయ ముక్కలు మగ్గిన తర్వాత స్టవ్ ను లో ఫ్లేమ్ కి తగ్గించి దానిలో ఉప్పు, మిరియాల పొడి, కారం వేసి కలుపుతూ అరనిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి.
ఆ తర్వాత కుక్ చేసి పక్కన పెట్టుకున్న సేమియా, ఎగ్స్ వేపుడు వేసి మసాలా మిశ్రమం మొత్తం సేమియాకు పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
ఆపై మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ నాలుగైదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి.ఇక చివర్లో కొతిమీర తరుగు వేసి కలిపి దింపేసుకుంటే చాలు. అంతే, సూపర్ టేస్టీ అండ్ హెల్దీ “ఎగ్ సేమియా” రెడీ!