జైనూర్లో భారీగా గంజాయి మొక్కలు స్వాధీనం..
ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం పట్నాపూర్ గ్రామ శివారులో అక్రమంగా సాగు చేస్తున్న గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
1,245 గంజాయి మొక్కలు
విలువ: రూ.1.54 కోట్లు
11 గ్రాముల ఎండు గంజాయి కూడా స్వాధీనం
ఈ వ్యవహారంలో ఇద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు
ఈ వివరాలను ఎస్పీ నితిక పంత్ వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 13న జైనూర్ ఎస్ఐ జి. రవికుమార్కు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు పట్నాపూర్ మెయిన్ రోడ్ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా కనిపించిన అంబురే పుండలిక్ (50)ను తనిఖీ చేయగా.. అతని టవల్లో దాచిన 11 గ్రాముల ఎండు గంజాయి బయటపడింది. ప్రభుత్వ పంచుల సమక్షంలో పంచనామా నిర్వహించిన పోలీసులు ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పుండలిక్ను విచారించగా.. తన కుమారుడు రమేశ్తో కలిసి వ్యవసాయ భూమిలో గంజాయి మొక్కలను అక్రమంగా సాగు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం లభించినట్లు అధికారులు తెలిపారు.
దీంతో పోలీసులు వ్యవసాయ విస్తరణ అధికారి (AEO), ప్రభుత్వ పంచ సాక్షుల సమక్షంలో పుండలిక్ వ్యవసాయ భూమిలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పొలంలో పెద్ద సంఖ్యలో గంజాయి మొక్కలను గుర్తించారు. మొత్తం 1,245 గంజాయి మొక్కలను వేర్లతో సహా స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ.1.50 కోట్లుగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. వ్యవసాయ పంట మధ్యలో అంతర పంటగా గంజాయిని సాగు చేస్తున్నట్లు దర్యాప్తులో గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సేకరించిన ఆధారాల మేరకు ఇద్దరు నిందితులను సెప్టెంబర్ 14న అరెస్ట్ చేశారు