జీహెచ్ఎంసీ విస్తరణకు కీలకమైన ‘మున్సిపాలిటీల విలీన ఆర్డినెన్స్’పై గవర్నర్ ఆమోదం తెలిపారు. ఫైల్ ప్రభుత్వానికి చేరడంతో, తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే గెజిట్ విడుదల చేయనుంది. ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం జీహెచ్ఎంసీ పరిధిని విస్తరించే తీర్మానం చేసింది. హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియాకు ఆనుకొని ఉన్న మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేసే ప్రతిపాదనకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది..
హైదరాబాద్, సికింద్రాబాద్ మున్సిపాలిటీల విలీనంతో 1955లో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ (ఎంసీహెచ్)ను ఏర్పాటు చేశారు. తరువాత మెదక్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని ఉప్పల్, ఎల్బీనగర్, గడ్డి అన్నారం, మల్కాజిగిరి, కాప్రా, అల్వాల్, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, కూకట్పల్లి, పటాన్చెరు, రామచంద్రాపురం, రాజేంద్రనగర్ మున్సిపాలిటీలను, పలు గ్రామాలను ఎంసీహెచ్‌లో విలీనం చేశారు..అలా విలీనం చేసి 2007లో జీహెచ్ఎంసీని ఏర్పాటు చేశారు. విలీన ప్రకటన విడుదలవగానే ఎంసీహెచ్ అధికారులు ఆయా మున్సిపాలిటీల్లోని ఇంజినీరింగ్ పనులు, నిధులకు సంబంధించిన రికార్డులు, చెక్కులు, ఆస్తి పన్ను దస్త్రాలు, ఇతర పత్రాలు అన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు. 2 నెలల పాటు ఆయా మున్సిపాలిటీల అధికారులే ఎప్పటిలాగే పౌరులకు సేవలు అందించారు. అప్పటివరకు ఎంసీహెచ్ పరిధికి ఓ కమిషనర్, 7 సర్కిళ్లకు ఏడుగురు ఉప కమిషనర్లు ఉండేవాళ్లు. విలీనం అనంతరం 12 మున్సిపాలిటీలను, 7 సర్కిళ్లను కలిపి 18 సర్కిళ్లుగా కలిపారు. వాటిపై పర్యవేక్షణకు 5 జోన్లు ఏర్పాటు చేశారు. తరువాత జోన్లు ఆరుకు, సర్కిళ్లు 30కి పెరిగాయి. అలా నగర విస్తీర్ణం 172 చదరపు కిలోమీటర్ల నుంచి 650 చదరపు కిలోమీటర్లకు పెరిగింది…
ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుంది : జీహెచ్ఎంసీలో 27 పట్టణ స్థానిక సంస్థల విలీనం తరువాత వాటికి సంబంధించిన ఆఫీస్‌ల ద్వారానే పరిపాలన కొనసాగుతుందని అధికారులు అంటున్నారు. ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను సర్కిళ్లుగా పేర్కొని, ప్రస్తుతం ఉన్న 6 జోనల్ ఆఫీస్‌లకు అనుసంధానిస్తారని అన్నారు. అంటే ప్రస్తుతం ఉన్న 30, నూతనంగా చేరే 27 సర్కిళ్లు కలిపి మొత్తం 57 సర్కిళ్లు, 6 జోనల్ కార్యాలయాల కిందే పని చేస్తాయి. 2 నెలల తరువాత జోన్ల సంఖ్యను పెంచడంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుందని అధికారులు అంటున్నారు..