రాఘవాపూర్ సబ్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన హరీష్‌రావు..

రాఘవాపూర్ సబ్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన హరీష్‌రావు..

సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టి. హరీష్‌రావు ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా సబ్‌స్టేషన్‌లోని లాక్‌బుక్‌ను పరిశీలించి విద్యుత్ సరఫరా రికార్డులను తనిఖీ చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ, బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు నాణ్యమైన 24 గంటల ఉచిత విద్యుత్ అందేదని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో కేవలం 12 గంటలే కాకుండా నాణ్యతలేని విద్యుత్ సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. రాఘవాపూర్ గ్రామంలో త్రీఫేజ్ విద్యుత్ కేవలం 10 గంటల 30 నిమిషాలు మాత్రమే అందుతున్నట్లు లాక్‌బుక్ రికార్డులు చెబుతున్నాయని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రైతులకు 24 గంటల విద్యుత్ ఇస్తామని చెప్పినా, క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా రంగనాయకసాగర్, మల్లన్నసాగర్‌లను నింపకపోవడంతో చెరువులు ఎండిపోతున్నాయని విమర్శించారు. రాష్ట్రంలోని అనేక గ్రామాల్లో త్రీఫేజ్ విద్యుత్‌ను ఉదయం వేళల్లో మాత్రమే సరఫరా చేస్తున్నారని చెప్పారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతులకు 24 గంటల విద్యుత్ అవసరం లేదని, మూడు గంటల విద్యుత్ చాలని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారని, ఇప్పుడు అదే విధానాన్ని అమలు చేస్తున్నారని హరీష్‌రావు ఆరోపించారు. నాణ్యమైన 24 గంటల విద్యుత్ కోసం రైతులు సబ్‌స్టేషన్ల ఎదుట ధర్నాలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.

వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం రైతులు దరఖాస్తులు చేసి డబ్బులు చెల్లించినప్పటికీ ట్రాన్స్‌ఫార్మర్లు, అవసరమైన మెటీరియల్ ఇవ్వడం లేదని ఆరోపించారు. సిద్దిపేటలో సుమారు వెయ్యి మంది రైతులు దరఖాస్తులు చేసి చెల్లింపులు చేసినా ఇప్పటికీ సామగ్రి అందలేదన్నారు. గతంలో రూ.4,900 డీడీ చెల్లిస్తే అవసరమైన మెటీరియల్ ఉచితంగా ఇచ్చేవారని, ప్రస్తుతం ఫీజు రూ.10 వేలకు పెంచినా మెటీరియల్ అందించడం లేదని విమర్శించారు. సిద్దిపేట స్టోర్‌లో ఒక్క ట్రాన్స్‌ఫార్మర్ కూడా అందుబాటులో లేదని అన్నారు.

హరీష్‌రావు మీడియాతో మాట్లాడుతున్న సమయంలోనే విద్యుత్ సరఫరా నిలిచిపోవడం గమనార్హమని పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లు, ఇతర మెటీరియల్‌ను రైతులకు వెంటనే అందించాలని, విద్యుత్ సరఫరాపై సమీక్ష నిర్వహించి నాణ్యమైన 24 గంటల విద్యుత్ అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.