యూఎస్ ఎయిర్‌పోర్టుల్లో ICE తనిఖీలు తీవ్రతరం.. భారతీయుల్లో ఆందోళన..

యూఎస్ ఎయిర్‌పోర్టుల్లో ICE తనిఖీలు తీవ్రతరం.. భారతీయుల్లో ఆందోళన
అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) అధికారులు దేశంలోని పలు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో తనిఖీలను మరింత కఠినతరం చేసినట్లు సమాచారం. వీసా గడువు ముగిసిన వారు, అలాగే ఇతర ఇమ్మిగ్రేషన్ దరఖాస్తులు (స్టేటస్ మార్పు, పొడిగింపు తదితరాలు) పరిశీలనలో ఉన్న వారిని లక్ష్యంగా చేసుకుని చెక్-ఇన్ కౌంటర్లు, బోర్డింగ్ గేట్ల వద్దే అదుపులోకి తీసుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం నిర్దేశించిన డిపోర్టేషన్ లక్ష్యాలను చేరుకోవడంలో భాగంగానే ఈ చర్యలు చేపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో అమెరికాలో నివసిస్తున్న భారతీయ ఐటీ నిపుణులు, విద్యార్థులు, ఇతర వీసాదారుల్లో ఆందోళన నెలకొంది.
గతంలో ప్రధానంగా క్రిమినల్ కేసులు ఉన్నవారు లేదా కోర్టు డిపోర్టేషన్ ఆదేశాలు ఎదుర్కొంటున్న వారిపైనే అధికారులు దృష్టి సారించేవారు. అయితే ఇప్పుడు విధానంలో మార్పు తీసుకువచ్చి, దేశవ్యాప్తంగా దాదాపు 15కు పైగా కీలక విమానాశ్రయాల్లో ఇమ్మిగ్రేషన్ తనిఖీలను మరింత ముమ్మరం చేసినట్లు సమాచారం.
ఇమ్మిగ్రేషన్ నిపుణులు సూచిస్తున్నదేమిటంటే.. అమెరికాలో చట్టబద్ధమైన హోదా ఉన్నవారు తమ వీసా, పాస్‌పోర్టు, I-20, I-797, EAD లేదా ఇతర సంబంధిత పత్రాలను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలని, అలాగే పెండింగ్‌లో ఉన్న ఇమ్మిగ్రేషన్ దరఖాస్తుల స్థితిపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.