21 ఏళ్ల కాపురానికి ముగింపు.. ప్రియుడితో భార్యకు పెళ్లి చేసిన భర్త!
ఉత్తరప్రదేశ్లోని సంత్ కబీర్నగర్ జిల్లాలో ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. 21 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న దంపతులకు ఐదుగురు పిల్లలు ఉన్నారు. అయితే, అదే గ్రామానికి చెందిన తనకంటే 13 ఏళ్లు చిన్నవాడితో మహిళకు పరిచయం ఏర్పడి, ఆ పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ రెండు నెలల క్రితం కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం.
ఇటీవల మహిళ తిరిగి ఇంటికి రావడంతో భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. విషయం గ్రామ పెద్దలు, ఇరు కుటుంబాల సభ్యుల దృష్టికి వెళ్లడంతో వారి సమక్షంలో చర్చలు జరిగాయి.
చర్చల అనంతరం మహిళ తన ప్రియుడితోనే జీవించాలని స్పష్టం చేయడంతో, భర్త కూడా అంగీకరించాడు. దీంతో మూడు కుటుంబాల సమక్షంలో భార్యకు ఆమె ప్రియుడితో వివాహం జరిపించి సాగనంపినట్లు స్థానికులు తెలిపారు.
ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. అయితే, ఈ ఘటనకు సంబంధించిన వివరాలు స్థానిక మీడియా కథనాల ఆధారంగా వెలుగులోకి వచ్చాయి..