వర్షాకాలం ముగిసింది… శీతాకాలం కొనసాగుతోంది… అయినా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో భారీ నుండి అతిభారీ వర్షాలు తప్పవని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు..IMD Rain Alert : ఇటీవల మొంథా తుపాను సృష్టించిన బీభత్సాన్ని తెలుగు ప్రజలు ఇంకా మర్చిపోనేలేదు… కొన్నిచోట్ల ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి. కేంద్ర బృందం తుపాను తీవ్రతను అంచనా వేయడానికి ఆంధ్ర ప్రదేశ్ లో పర్యటిస్తోంది… అంటే మొంథా కల్లోలం ఇంకా కళ్లముందే ఉందన్నమాట. ఇలాంటి సమయంలో మరో తుపాను తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలం సృష్టించే అవకాశాలున్నట్లు వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం చలిగాలులు కొనసాగుతున్నా వచ్చేవారం వాతావరణం పూర్తిగా మారిపోతుందని అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు పూర్తిగా నిష్క్రమించి ఈశాన్య రుతుపవనాలు కొనసాగుతున్నాయి. రాబోయే రోజుల్లో రుతుపవనాల ప్రభావంతో వర్షాలు జోరందుకుంటాయని హెచ్చరిస్తున్నారు. దీనికి తోడు బంగాళాఖాతంలో త్వరలోనే అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని… ఇది వాయుగుండంగా మారుతుందని… తుపానుగా బలపడే అవకాశాలు కూడా ఉన్నాయని వైజాగ్ వెదర్ మ్యాన్ హెచ్చరిస్తున్నారు. నవంబర్ 18 నుండి 25 వరకు అంటే వారంరోజులపాటు వాయుగుండం లేదా తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వైజాగ్ వెదర్ మ్యాన్ అంచనా వేస్తున్నారు.