అండర్సన్-తెందుల్కర్ ట్రోఫీని భారత్ ఘనంగా ఆరంభించింది. అయిదు టెస్టుల సిరీస్ మొదటి మ్యాచ్‌లో తొలి రోజు, శుక్రవారం బ్యాట్‌తో అదరగొట్టిన టీమ్ఇండియా.. 3 వికెట్లకు 359 పరుగులతో భారీ స్కోరు దిశగా సాగుతోంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (127 బ్యాటింగ్; 175 బంతుల్లో 16×4, 1×6), ఓపెనర్ యశస్వి జైస్వాల్ (101; 159 బంతుల్లో 16×4, 1×6) సెంచరీలతో ఇన్నింగ్స్‌కు ఇరుసులా నిలిచారు. రాహుల్ (42; 78 బంతుల్లో 8×4) కూడా రాణించాడు. ఆట చివరికి శుభ్మన్తో కలిసి వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ (65 బ్యాటింగ్; 102 బంతుల్లో 6×4, 2×6) క్రీజులో ఉన్నాడు..ఆరంభం అదిరింది.. కానీ: 91/0.. కాసేపట్లో లంచ్ అనగా భారత్ స్కోరిది. టాస్ గెలిచి తమను బ్యాటింగ్ దించిన ఇంగ్లాండ్ నిర్ణయం తప్పని నిరూపిస్తూ తొలి సెషన్ ఆఖరి దాకా టీమ్ఇండియా పైచేయి సాధించింది. కానీ 6 నిమిషాల వ్యవధిలో.. 6 బంతుల తేడాలో ఇంగ్లాండ్ మ్యాచ్‌లోకి వచ్చింది. అంతకుముందు బ్యాటింగ్‌కు దిగిన భారత్ జాగ్రత్తగా ఆడింది. యశస్వి జైస్వాల్‌తో ఎవరు జతగా వస్తారనే చర్చకు తెర దించుతూ అనుభజ్ఞుడైన కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేశాడు. ఆరంభంలో స్వింగ్‌తో ఇంగ్లాండ్ పేసర్లు.. యశస్వి, రాహుల్‌ను పరీక్షించారు. కానీ భారత ఆటగాళ్లు ఏమాత్రం తొందరపడలేదు. బంతి గతి తప్పినప్పుడు మాత్రమే షాట్లు ఆడారు. రాహుల్ ముచ్చటైన కవర్‌డ్రైవ్‌లు ఆడితే.. యశస్వి బ్యాక్‌ఫుట్ కట్షాట్లు, డ్రైవ్‌లతో స్కోరు పెంచాడు. కాసేపట్లో లంచ్ అనగా ఇంగ్లాండ్.. టీమ్ఇండియాను దెబ్బ కొట్టింది. మొదట కార్స్ బౌలింగ్‌లో ఆఫ్ స్టంప్ లోగిలిలో పడిన బంతిని వెంటాడిన రాహుల్.. స్లిప్‌లో రూట్‌కు క్యాచ్ ఇచ్చాడు. తర్వాతి ఓవర్లో టీమ్ఇండియాకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఐపీఎల్లో అదరగొట్టి.. ఈ మ్యాచ్‌లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన సాయి సుదర్శన్ (0) పేలవంగా ఔటయ్యాడు. స్టోక్స్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ జేమి స్మిత్‌కు దొరికిపోయాడు. స్టోక్స్ లెగ్‌సైడ్ వేసిన బంతిని గ్లాన్స్ ఆడే ప్రయత్నంలో సుదర్శన్ వెనుదిరిగాడు. దీంతో స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు పడిన నిరాశలో భారత్.. ప్రత్యర్థిని దెబ్బ తీశామన్న ఆనందంలో ఇంగ్లాండ్ లంచ్‌కు వెళ్లాయి.
గేరు మార్చారు: తక్కువ సమయంలో రెండు వికెట్లు పడినా.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, యశస్వి రక్షణాత్మకంగా ఆడలేదు. శుభ్‌మన్ ఒత్తిడి లేకుండా క్రీజులో స్వేచ్ఛగా కదులుతూ షాట్లు ఆడాడు. వోక్స్ వేసిన ఓ ఓవర్లో అతడు మూడు ఫోర్లు కొట్టాడు. ఈ క్రమంలో ఆడిన ఓ స్ట్రెట్డ్రైవ్ అద్భుతం. మరోవైపు 45 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కార్స్ బౌలింగ్‌లో యశస్వి ఎల్బీగా ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. మిడిల్ స్టంప్‌కు నేరుగా కార్స్ వేసిన యార్కర్ యశస్వి కాలికి తగిలింది. దీంతో అతడు ఎల్బీగా వెనుదిరగడం ఖాయంగా కనిపించింది. సమీక్షలో కార్స్ నోబాల్ వేసినట్లు తేలడంతో యశస్వికి జీవనదానం లభించింది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ యశస్వి అర్ధసెంచరీ చేశాడు. ఈ మైలురాయి అందుకున్నాక దూకుడు పెంచాడు. వోక్స్ ఓవర్లో మూడు ఫోర్లు బాదిన యశస్వి.. టంగ్ బంతిని స్టాండ్స్‌లోకి కొట్టాడు. ఇంకోవైపు జోరు కొనసాగించిన శుభ్‌మన్.. టంగ్ బౌలింగ్‌లో ఫోర్‌తో 56 బంతుల్లోనే అర్ధసెంచరీ అందుకున్నాడు. కార్స్ ఓవర్లో మూడు ఫోర్లు కొట్టి 99కి చేరుకున్న యశస్వి.. తర్వాతి బంతికి సింగిల్‌తో ఇంగ్లాండ్‌లో తొలి సెంచరీ నమోదు చేశాడు. టెస్టుల్లో అతడికిది అయిదో సెంచరీ. 96 బంతుల్లో అర్ధసెంచరీ చేసిన ఈ లెఫ్ట్ హ్యాండర్ మరో 48 బంతుల్లోనే మూడంకెల మార్కు అందుకోవడం విశేషం. టీ విరామానికి భారత్ 215/2తో బలమైన స్థితిలో నిలిచింది..
భారత్ తొలి ఇన్నింగ్స్: యశస్వి జైస్వాల్ (బి) స్టోక్స్ 101; రాహుల్ (సి) రూట్ (బి) కార్స్ 42; సుదర్శన్ (సి) స్మిత్ (బి) స్టోక్స్ 0; శుభ్‌మన్ బ్యాటింగ్ 127; పంత్ బ్యాటింగ్ 65; ఎక్స్‌ట్రాలు 24 మొత్తం: (85 ఓవర్లలో 3 వికెట్లకు) 359
వికెట్ల పతనం: 1-91, 2-92, 3-221
బౌలింగ్: వోక్స్ 19-2-89-0; కార్స్ 16-5-70-1; టంగ్ 16-0-75-0; స్టోక్స్ 13-1-43-2; బషీర్ 21-4-66-..
దుమ్మురేపిన జైస్వాల్, గిల్
రెండో సెషన్లో జైస్వాల్, గిల్ మరింత సాధికారికంగా బ్యాటింగ్ చేశారు.ఈ క్రమంలో జైస్వాల్ 96 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు గిల్ దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. దాంతో భారత్ స్కోర్ బోర్డు పరుగెత్తింది. శుభ్‌మన్ గిల్ 56 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం దూకుడుగా ఆడిన యశస్వి జైస్వాల్.. బౌండరీల మోత మోగించాడు. 144 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఇంగ్లండ్ గడ్డపై ఆడిన తొలి మ్యాచ్‌లోనే సెంచరీ బాదాడు. ఇది జైస్వాల్‌కు ఐదో టెస్ట్ సెంచరీ. దాంతో భారత్ 51 ఓవర్లలో 215/2 స్కోర్‌తో టీ బ్రేక్‌కు వెళ్లింది.
రిషభ్ పంత్ స్పెషల్ షో..
మూడో సెషన్ ప్రారంభంలోనే టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. జైస్వాల్‌ను స్టోక్స్ స్టన్నింగ్ డెలివరీతో క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో మూడో వికెట్‌కు నమోదైన 129 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. రిషభ్ పంత్ వచ్చి రావడంతోనే తన ట్రేడ్ మార్క్ బౌండరీతో స్టోక్స్‌ను బెంబేలెత్తించాడు. మరోవైపు గిల్ తనదైన షాట్లతో విరుచుకుపడ్డాడు. పంత్ కాస్త స్లోగా ఆడినా గిల్.. వేగంగా పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతను 140 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఆ కాసేపటికే పంత్ కూడా 91 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం దూకుడుగా ఆడిన పంత్ రెండు భారీ సిక్సర్లు కొట్టాడు. దాంతో 85 ఓవర్లలో టీమిండియా 3 వికెట్లకు 359 పరుగులతో తొలి రోజు ఆటను ముగించింది..