బంగ్లాదేశ్ పై భారత్ విజయం.. సెంచరీ తో మ్యాచ్ ని ముగించిన కోహ్లీ….

వరల్డ్ కప్ 2023 టోర్నీలో టీమిండియా వరుసగా నాలుగో విజయాన్ని అందుకుంది. పూణేలో వేదికగా జరిగిన మ్యాచ్‌లో 257 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది భారత జట్టు.
విరాట్ కోహ్లీ అజేయ సెంచరీతో మ్యాచ్‌ని ముగించాడు.

రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ కలిసి దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించారు. మొదటి ఓవర్ నుంచి బౌండరీల మోత మోగించిన రోహిత్ శర్మ 40 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 48 పరుగులు చేసి… హాఫ్ సెంచరీకి 2 పరుగుల దూరంలో అవుట్ అయ్యాడు. హసన్ మహ్మద్ బౌలింగ్‌లో ఓ భారీ సిక్సర్ బాదిన రోహిత్ శర్మ, ఆ తర్వాతి బంతికి కూడా భారీ షాట్‌ ఆడి బౌండరీ లైన్ దగ్గర తోహిద్ హృదయ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు..

ఈ ఏడాది ఇప్పటికే 61 సిక్సర్లు బాదిన రోహిత్ శర్మ, ఓ క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన కెప్టెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. విరాట్ కోహ్లీ వస్తూనే 2, 4, 6 బాదడంతో ఆ ఓవర్‌లో టీమిండియా ఖాతాలో 23 పరుగులు చేరాయి. 55 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 53 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, హాఫ్ సెంచరీ తర్వాత అవుట్ అయ్యాడు. మెహిదీ హసన్ మిరాజ్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ కోసం ప్రయత్నించిన శుబ్‌మన్ గిల్, బౌండరీ లైన్ దగ్గర మహ్మదుల్లా పట్టిన సూపర్ క్యాచ్‌కి పెవిలియన్ చేరాడు.. శుబ్‌మన్ గిల్‌కి ఇది వన్డేల్లో 10వ హాఫ్ సెంచరీ.

132 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది టీమిండియా. 25 బంతుల్లో 2 ఫోర్లతో 19 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్, మెహిదీ హసన్ మిరాజ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి పెవిలియన్ చేరాడు.

విరాట్ కోహ్లీ 73 పరుగుల వద్ద ఉన్నప్పుడు టీమిండియా విజయానికి 28 పరుగులే కావాలి. ఆ తర్వాతి ఓవర్‌లో సిక్సర్ బాది 80ల్లోకి వచ్చిన విరాట్ కోహ్లీ, ఇన్నింగ్స్ 40వ ఓవర్‌లో 4, 6 బాది 11 పరుగులు రాబట్టాడు. ఆ తర్వాతి ఓవర్‌లో 2, 2, 1.పరుగులు తీసిన విరాట్ కోహ్లీ… టీమిండియా విజయానికి 2 పరుగులు కావాల్సిన సమయంలో సిక్సర్ బాది వన్డేల్లో 48వ సెంచరీ అందుకున్నాడు..