ఇంగ్లాండ్ తో నాలుగో టెస్ట్ మ్యాచ్ లో భారత్ అద్భుతంగా పోరాడింది. చివరి రోజు భారత బ్యాటర్లు వీరోచిత పోరాటం కనబరిచారు. దీంతో నాలుగో టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ముందు కెప్టెన్ శుభ్ మన్ గిల్ సెంచరీతో చెలరేగాడు. ఆ తర్వాత రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఇద్దరూ సెంచరీలతో అదరగొట్టారు. 2 వికెట్లు కోల్పోయిన దశలో టీమిండియా ఓటమి తప్పదని అంతా భయపడ్డారు. కానీ గిల్, ఆల్ రౌండర్లు జడేజా, సుందర్.. అద్భుతమైన సెంచరీలతో ఇన్నింగ్స్ ఓటమిని తప్పించారు. ఓపెనర్ కేఎల్ రాహుల్ కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 230 బంతుల్లో 90 పరుగులు చేసి ఔటయ్యాడు..గిల్ 238 బంతుల్లో 103 పరుగులు చేసి ఔటయ్యాడు. రవీంద్ర జడేజా 185 బంతుల్లో 107 పరుగులు, సుందర్ 206 బంతుల్లో 101 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు. 143 ఓవర్లు ఆడిన భారత్.. 4 వికెట్ల నష్టానికి 425 పరుగులు చేసింది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో భారత్ 358 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇంగ్లాండ్ తన తొలి ఇన్నింగ్స్ లో 669 పరుగులు చేసింది…మ్యాచ్ ని డ్రా గా ముగిద్దామని తొలుత ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ప్రతిపాదన చేశాడు. అయితే అందుకు భారత్ నిరాకరించింది. ఆ సమయంలో జడేజా, సుందర్ లు సెంచరీకి దగ్గరలో ఉన్నారు. వారిద్దరూ శతకాలు పూర్తి చేసుకున్నాక స్టోక్స్ ప్రతిపాదనకు భారత్ ఓకే చెప్పింది. 5 టెస్ట్ మ్యాచుల ఈ సిరీస్ లో ఇంగ్లాండ్ 2-1తో ఆధిక్యంలో ఉంది. ఫైనల్ టెస్ట్ లో ఎవరు గెలిస్తే వారే సిరీస్ విన్నర్ అవుతారు…
చరిత్ర సృష్టించిన శుభ్‌మన్ గిల్...
సునీల్ గవాస్కర్ – 4 టెస్టుల్లో 774 పరుగులు (1970/71 సీజన్లో వెస్టిండీస్‌పై)
సునీల్ గవాస్కర్ – 6 మ్యాచ్‌ల్లో 732 పరుగులు (1978/79లో వెస్టిండీస్ పై)
యశస్వి జైస్వాల్ – 5 మ్యాచ్‌ల్లో 712 పరుగులు (2024లో ఇంగ్లాండ్ పై)
శుభ్‌మన్ గిల్ – 4 మ్యాచ్‌ల్లో 700 * పరుగులు (2025లో ఇంగ్లాండ్ పై)
విదేశీ గడ్డపై 1000 పరుగులు చేసి 30 వికెట్లు తీసిన ఆటగాళ్లు
(1032, 42) – విల్ఫ్రెడ్ రోడ్స్ (ఇంగ్లాండ్), ఆస్ట్రేలియా
(1820, 62) – గ్యారీ సోబర్స్ (వెస్టిండీస్), ఇంగ్లాండ్
(1000*, 34) – రవీంద్ర జడేజా (భారతదేశం), ఇంగ్లాండ్..
మూడో బ్యాటర్‌గా రికార్డ్..
ఓ టెస్ట్ సిరీస్‌లో నాలుగు శతకాలు నమోదు చేసిన మూడో భారత బ్యాటర్‌గా కూడా శుభ్‌మన్ గిల్ రికార్డ్ సాధించాడు. అతని కంటే ముందు సునీల్ గవాస్కర్ వెస్టిండీస్‌పై 1971, 1979 సిరీస్‌ల్లో రెండు సార్లు నాలుగేసి శతకాలు నమోదు చేయగా.. విరాట్ కోహ్లీ 2015లో ఆస్ట్రేలియాపై 4 సెంచరీలు బాదాడు. తాజాగా శుభ్‌మన్ గిల్ ఈ ఫీట్ సాధించాడు. ఓ టెస్ట్ సిరీస్‌లో నాలుగు శతకాలు బాదిన నాలుగో కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ గుర్తింపు పొందాడు. సర్ డాన్ బ్రాడ్ మాన్ 1948లో సొంతగడ్డపై భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఫీట్ సాధించాడు. సునీల్ గవాస్కర్ 1979లో సొంతగడ్డపై వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 సెంచరీలు బాదాడు. తాజాగా శుభ్‌మన్ గిల్.. ఇంగ్లండ్‌పై ఈ ఫీట్ సాధించాడు.
గ్రేగ్ చాపెల్ రికార్డ్ బద్దలు..
కెప్టెన్‌గా అరంగేట్ర టెస్ట్ సిరీస్‌లోనే అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా కూడా శుభ్‌మన్ గిల్ నిలిచాడు. సర్ డాన్ బ్రాడ్‌మన్ రికార్డ్‌ను అధిగమించేందుకు గిల్.. 89 పరుగుల దూరంలో ఉన్నాడు. ఆఖరి టెస్ట్‌లో ఈ పరుగులు చేస్తే బ్రాడ్ మన్ రికార్డ్ కూడా బద్దలవనుంది. బ్రాడ్ మన్ 1937లో ఇంగ్లండ్‌పై కెప్టెన్‌గా అరంగేట్ర సిరీస్‌లో 810 పరుగులు చేశాడు. ఆ తర్వాత శుభ్‌మన్ గిల్(722*) రెండో స్థానంలో ఉండగా.. గ్రేగ్ చాపెల్(1976లో 702), క్లైవ్ లాయడ్(1975లో 636), పీటర్ మే(1955లో 582) తర్వాతి స్థానాల్లో ఉన్నారు..
రాహుల్, గిల్ ఔట్:
2 వికెట్ల నష్టానికి 174 పరుగులతో చివరి రోజు బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా తొలి అరగంట జాగ్రత్తగానే ఆడింది. నాలుగో రోజు మాదిరి ఐదో రోజు కూడా గిల్, రాహుల్ డిఫెన్స్ కే పరిమితమయ్యారు. 70 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన ఈ జోడీని ఎట్టకేలకు ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్ విడగొట్టాడు. రాహుల్ 90 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద స్టోక్స్ వేసిన ఒక ఇన్ స్వింగ్ డెలివరీ అనూహ్యంగా లోపలికి దూసుకొచ్చింది. దీంతో రాహుల్ ఎల్బీడబ్ల్యూ రూపంలో వెనుదిరగడంతో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. లంచ్ కు ముందు జోఫ్రా ఆర్చర్ సెంచరీ చేసిన గిల్(103) ను ఔట్ చేసి ఇండియాకు షాక్ ఇచ్చాడు.
జడేజా, సుందర్ పోరాటం:
4 వికెట్ల నష్టానికి 222 పరుగులతో చివరి రోజు రెండో సెషన్ ప్రారంభించిన టీమిండియా ఈ సెషన్ లో వికెట్ కోల్పోకుండా 100 పరుగులు చేసింది. జడేజా, సుందర్ మరీ డిఫెన్స్ కే పరిమితం కాకుండా స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు. ఈ క్రమంలో వీరిద్దరూ టీ విరామానికి ముందు తమ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు.
జడేజా, సుందర్ సెంచరీలు:
4 వికెట్ల నష్టానికి 322 పరుగులతో చివరి సెషన్ ప్రారంభించిన ఇండియాను సుందర్, జడేజా ముందుకు తీసుకెళ్లారు. వీరిద్దరూ మూడో సెషన్ లో స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా జడేజా వేగంగా పరుగులు చేశాడు. ఈ క్రమంలో మొదట జడేజా తర్వాత సుందర్ తమ సెంచరీలు పూర్తి చేసుకున్నారు..