విజయంపై గురి…. ఇక బౌలర్ల పైనే..!

భారత్, ఇంగ్లాండ్‌ మధ్య మొదటి టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. టీమ్‌ఇండియా గట్టి లక్ష్యాన్నే నిర్దేశించినా.. దూకుడుగా ఆడే ఆతిథ్య జట్టును తేలికగా తీసుకోలేని పరిస్థితి. ఓవర్‌నైట్‌ స్కోరు 90/2తో సోమవారం, రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన టీమ్‌ఇండియా.. పంత్‌ (118; 140 బంతుల్లో 15×4, 3×6), రాహుల్‌ (137; 247 బంతుల్లో 18×4)ల అదిరే శతకాలతో 364 పరుగులు చేసింది. గిల్‌ జట్టు ఇంకా పెద్ద స్కోరే చేయాల్సింది. కానీ అనూహ్యంగా తడబడింది. కార్స్, టంగ్‌ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో ఆరు పరుగుల ఆధిక్యం లభించిన సంగతి తెలిసిందే. 371 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌.. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. క్రాలీ (12), డకెట్‌ (9) క్రీజులో ఉన్నారు.

భాగస్వామ్యం..

పంత్, రాహుల్‌ల అద్భుత భాగస్వామ్యమే. వాళ్లే పోరాడకుంటే పరిస్థితి భిన్నంగా ఉండేదే. ఎందుకంటే హెడింగ్లీలో ఉదయం మబ్బులు పట్టిన వాతావరణంలో పేలవంగా మొదలెట్టింది టీమ్‌ఇండియా. ఓవర్‌నైట్‌ స్కోరుకు రెండు పరుగులు చేరాయో లేదో గట్టి ఎదురుదెబ్బ తగలింది. తొలి ఓవర్లోనే కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ వెనుదిరిగాడు. తొలి ఇన్నింగ్స్‌లో సూపర్‌ సెంచరీ చేసిన అతడు.. కార్స్‌ బౌలింగ్‌లో ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌తో బౌల్డయ్యాడు. ఇంగ్లాండ్‌ సంబరాల్లో మునిగిపోయింది. భారత్‌ను ఒత్తిడికి గురి చేసి చుట్టేయొచ్చని భావించి ఉంటుంది. కానీ రాహుల్, పంత్‌ ఆ జట్టుకు ఎలాంటి అవకాశమూ ఇవ్వలేదు. ఏమాత్రం తడబడలేదు. సాధికారిక బ్యాటింగ్‌తో భారత్‌ను ఆదుకున్నారు. అత్యంత విలువైన భాగస్వామ్యంతో జట్టును పటిష్ట స్థితిలో నిలిపారు. త్వరగా వికెట్‌ పడడంతో మొదట జాగ్రత్తగానే ఆడినా.. క్రమంగా వేగం పెంచి కళ్లు చెదిరే షాట్లతో జట్టుకు విలువైన పరుగులను అందించారు. పంత్, రాహుల్‌ల 195 పరుగుల భాగస్వామ్యమే నాలుగో రోజు ఆటలో హైలైట్‌. లంచ్‌ వరకు 24.1 ఓవర్లలో 63 పరుగులే చేసిన భారత్‌.. లంచ్‌ తర్వాతి సెషన్లో బ్యాటర్ల జోరుతో 27 ఓవర్లలో ఏకంగా 145 పరుగులు రాబట్టింది…

శతకాలతో అదుర్స్‌..: లంచ్‌ బ్రేక్‌ తర్వాత రాహుల్‌-పంత్‌ జోడీ ప్రత్యర్థి బౌలర్లను మరింత విసిగించింది. ఇద్దరూ శతకాలతో ఆకట్టుకున్నారు. ఈసారి పంత్‌ తన సహజశైలిలో చెలరేగడంతో రెండో సెషన్‌లో 145 పరుగులు సమకూరాయి. పేసర్‌ టంగ్‌, స్పిన్నర్‌ బషీర్‌లను లక్ష్యంగా చేసుకున్న తను బౌండరీలతో చకచకా స్కోరును పెంచసాగాడు. మరో ఎండ్‌లో రాహుల్‌ 202 బంతుల్లో సెంచరీని పూర్తి చేశాడు. ఇక 90కి చేరగానే పంత్‌ జాగ్రత్తగా ఆడాడు. మరో పది పరుగుల కోసం 26 బంతులాడి వరుసగా రెండో సెంచరీని పూర్తి చేశాడు. ఆ వెంటనే బ్యాట్‌ ఝళిపిస్తూ రూట్‌ ఓవర్‌లో 4,6,4తో 19 రన్స్‌ రాబట్టాడు. కానీ పంత్‌ జోరుకు స్పిన్నర్‌ బషీర్‌ బ్రేక్‌ వేయడంతో నాలుగో వికెట్‌కు 195 పరుగుల భారీ భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత రాహుల్‌, కరుణ్‌ (20) మరో వికెట్‌ కోల్పోకుండా టీ బ్రేక్‌కు వెళ్లారు.

వికెట్లు టపటపా: చివరి సెషన్‌లో పుంజుకున్న ఇంగ్లండ్‌ బౌలర్లు కేవలం 31 పరుగుల వ్యవధిలోనే మిగిలిన ఆరు వికెట్లను పడగొట్టారు. రాహుల్‌-కరుణ్‌ మధ్య ఐదో వికెట్‌కు 46 పరుగులు జత చేరాక వికెట్ల పతనం ఆరంభమైంది. కొత్త బంతిని తీసుకున్నాక రాహుల్‌ పోరాటం ముగిసింది. 85వ ఓవర్‌లో అతడిని కార్స్‌ బౌల్డ్‌ చేశాడు. ఆ తర్వాత వోక్స్‌కు రిటర్న్‌ క్యాచ్‌తో కరుణ్‌ వెనుదిరిగాడు. ఓ వైపు జడేజా నిలదొక్కుకోవాలని చూసినా.. 91వ ఓవర్‌లో పేసర్‌ టంగ్‌ ధాటికి శార్దూల్‌ (4), సిరాజ్‌ (0), బుమ్రా (0) పెవిలియన్‌కు చేరారు. ఇక ప్రసిద్ధ్‌ (0) వికెట్‌తో బషీర్‌ భారత్‌ రెండో ఇన్నింగ్స్‌కు చెక్‌ పెట్టాడు.

స్కోరుబోర్డు

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 471

ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 465

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (సి) స్మిత్‌ (బి) కార్స్‌ 4; రాహుల్‌ (బి) కార్స్‌ 137; సాయి సుదర్శన్‌ (సి) క్రాలే (బి) స్టోక్స్‌ 30; గిల్‌ (బి) కార్స్‌ 8; పంత్‌ (సి) క్రాలే (బి) బషీర్‌ 118; కరుణ్‌ (సి అండ్‌ బి) వోక్స్‌ 20; జడేజా (నాటౌట్‌) 25; శార్దూల్‌ (సి) రూట్‌ (బి) టంగ్‌ 4; సిరాజ్‌ (సి) స్మిత్‌ (బి) టంగ్‌ 0; బుమ్రా (బి) టంగ్‌ 0; ప్రసిద్ధ్‌ (సి) టంగ్‌ (బి) బషీర్‌ 0; ఎక్స్‌ట్రాలు: 18; మొత్తం: 96 ఓవర్లలో 364 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-16, 2-82, 3-92, 4-287, 5-333, 6-335, 7-349, 8-349, 9-349, 10-364. బౌలింగ్‌: వోక్స్‌ 19-4-45-1; కార్స్‌ 19-2-80-3; టంగ్‌ 18-2-72-3; బషీర్‌ 22-1-90-2; స్టోక్స్‌ 15-2-47-1, రూట్‌ 3-0-21-0.

ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌: క్రాలే (బ్యాటింగ్‌) 12; డకెట్‌ (బ్యాటింగ్‌) 9; మొత్తం: 6 ఓవర్లలో 21/0. బౌలింగ్‌: బుమ్రా 3-0-9-0, సిరాజ్‌ 2-1-9-0, జడేజా 1-0-3-0.

ఇంగ్లండ్‌లో వరుసగా ఐదు ఇన్నింగ్స్‌లో 50+ స్కోర్లు సాధించిన పర్యాటక బ్యాటర్‌గా బ్రాడ్‌మన్‌, క్రోనే, చందర్‌పాల్‌, సంగక్కర, డారిల్‌ మిచెల్‌తో సమంగా నిలిచిన పంత్‌. వరుసగా ఏడు ఫిఫ్టీలతో స్మిత్‌ టాప్‌లో ఉన్నాడు..