వన్డే చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు మూటగట్టుకున్నా భారత్..!

భారత క్రికెట్ అభిమానులకు ఇదొక పీడకల! న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో వన్డేలో టీమిండియా అత్యంత దారుణమైన ఓటమిని చవిచూసింది. 334 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియన్ టీమ్, కనీసం 100 పరుగుల మార్క్‌ను కూడా దాటలేక కేవలం 89 పరుగులకే కుప్పకూలింది..ఫలితంగా 244 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అయితే, ఈ ఘోర అవమానంలోనూ టీమిండియాకు ఒకే ఒక్క ఊరట కలిగించే అంశం ఉంది. కేవలం ఒక్క పరుగు తేడాతో వన్డే చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు నుంచి టీమిండియా తృటిలో తప్పించుకుంది.

వన్డే చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు:

భారత క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా ఇప్పటి వరకు అతిపెద్ద ఓటమి 2000 సంవత్సరంలో నమోదైంది. అప్పట్లో షార్జా వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 54 పరుగులకే ఆలౌట్ అయి 245 పరుగుల తేడాతో ఓడిపోయింది. సరిగ్గా 26 ఏళ్ల తర్వాత, ఇవాళ (నవంబర్ 13, 2026) మౌంట్ మౌంగనుయ్‌ (Mount Maunganui)లో ఆ చెత్త రికార్డు బద్దలయ్యే పరిస్థితి వచ్చింది. భారత జట్టు 88 పరుగుల వద్ద ఆలౌట్ అయి ఉంటే, చరిత్రలోనే అత్యంత భారీ ఓటమిగా నిలిచిపోయేది. కానీ ఆఖర్లో యువ బ్యాటర్ నమన్ ధీర్ (21) బాదిన రెండు సిక్సర్లు, కొన్ని ఎక్స్‌ట్రాల పుణ్యమా అని స్కోరు 89కి చేరింది. దీంతో 244 రన్స్ తేడాతో ఓడి, కేవలం ఒక్క పరుగు తేడాతో ఆ మాయని మచ్చ నుంచి ఇండియన్ టీమ్ బయటపడింది..

గతంలో శ్రీలంక చేతిలో ఎదురైన 245 పరుగుల అత్యంత భారీ ఓటమి రికార్డును సమం చేసే ప్రమాదం నుంచి భారత్ కేవలం ఒక్క పరుగు తేడాతో బయటపడింది. టెస్ట్ సిరీస్ సన్నాహాల కోసం పలువురు కీలక ప్లేయర్లు.. ముఖ్యంగా రెగ్యులర్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ జట్టుకు దూరమవడం ఈ మ్యాచ్‌లో స్పష్టంగా కనిపించింది. శుభ్‌మన్ గిల్ గైర్హాజరీలో జట్టు పగ్గాలు చేపట్టిన తాత్కాలిక కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తీసుకున్న తప్పుడు నిర్ణయాలు జట్టు కొంపముంచాయి…

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడమే అసలు తప్పిదం

టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మరోసారి టాస్ గెలిచినప్పటికీ.. పిచ్ పరిస్థితులను అంచనా వేయడంలో విఫలమయ్యాడు. గత మూడు మ్యాచ్‌ల తరహాలో వర్షం ముప్పు, డక్‌వర్త్ లూయిస్ నిబంధన ప్రభావం లేనప్పటికీ శ్రేయస్ అయ్యర్ ముందుగా బౌలింగ్ ఎంచుకోవడం పెద్ద బ్లండర్‌గా మారింది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ పేలవమైన ఫీల్డింగ్‌ను సద్వినియోగం చేసుకున్న న్యూజిలాండ్ పవర్‌ప్లేలో వికెట్ నష్టపోకుండా 72 పరుగులు రాబట్టింది. ఆ తర్వాత భారత బౌలర్లు కాస్త పుంజుకున్నప్పటికీ.. విల్ యంగ్ సెంచరీ, టిమ్ సీఫెర్ట్ అర్ధశతకానికి తోడు మిడిలార్డర్ రాణించడంతో కివీస్ 333 పరుగుల భారీ స్కోరు సాధించింది..

భారత్ జట్టు కేవలం 89 పరుగులకే ఆలైట్ కావడానికి హెన్రీ విజృంభణే ప్రధాన కారణం. విల్ యంగ్ అద్భుతమైన శతకంతో జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించినా, హెన్రీ చేసిన మ్యాచ్ విన్నింగ్ బౌలింగ్ ప్రదర్శనే అతడిని అవార్డుకు అర్హుడిగా నిలబెట్టింది. పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో మాట్ హెన్రీ మాట్లాడుతూ, బౌలింగ్ పరిస్థితులు, గాలి తీవ్రతను అనుకూలంగా మలుచుకుంటూ సరైన లెంగ్త్‌లో బంతులు విసిరినట్లు తెలిపాడు.

చెత్త బౌలింగ్‌
మౌంట్‌ మౌంగనూయ్‌ వేదికగా ఈ మ్యాచ్‌లో కుల్దీప్‌ యాదవ్‌ చెత్త ప్రదర్శన కనబరిచాడు. కేవలం ఎనిమిది ఓవర్లు మాత్రమే బౌలింగ్‌ చేసిన ఈ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ ఏకంగా 73 పరుగులు సమర్పించుకుని ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. ఈ క్రమంలో రాకరాక అవకాశం వస్తే ఏకంగా తొమ్మిదికి పైగా ఎకానమీ రేటుతో ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నాడంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నీ చేతులతో నువ్వే అంతా నాశనం చేసుకున్నావు.

”కుల్దీప్‌ యాదవ్‌ తన చేతులతో తానే తన వరల్డ్‌కప్‌ టికెట్‌ను చించేసుకున్నాడు. నీ చేతులతో నువ్వే అంతా నాశనం చేసుకున్నావు కుల్దీప్‌. ఇక టీమిండియా యాజమాన్యం అతడిని వదిలేస్తుంది. ప్రపంచకప్‌ సన్నాహకాల నుంచి అతడు తప్పుకొన్నట్లే. ఇలాంటి బౌలర్లకు అవకాశం ఇస్తే జట్టు భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుంది..