అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ, హోర్ముజ్ జలసంధి వద్ద అమెరికా విధిస్తున్న దిగ్బంధాన్ని భారత్ చాకచక్యంగా అధిగమిస్తోంది. ఒమన్ జలాల గుండా రహస్యంగా, ట్రాన్స్పాండర్లు ఆఫ్ చేసి భారత ట్యాంకర్లు ముంబైకి చేరుతున్నాయి. ఇరాన్ దౌత్య మద్దతు, ఇండియన్ నేవీ రక్షణతో ఈ సాహసం సాగుతున్నప్పటికీ, కాల్పుల ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. చమురు ధరలు పెరగకుండా భారత్ చేస్తున్న ఈ పోరాటం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది..ప్రపంచ దేశాల కళ్లు గల్ఫ్ ప్రాంతంపైనే ఉన్నాయి. అమెరికా విధిస్తున్న నౌకాదళ దిగ్బంధం (Naval Blockade) వల్ల గల్ఫ్ దేశాల నుంచి చమురు సరఫరా ఆగిపోతుందని, భారత్లో పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటుతాయని అందరూ భయపడ్డారు. కానీ, తెర వెనుక భారత్ తనదైన శైలిలో పావులు కదిపింది. ఏప్రిల్ 13 నుంచి హార్ముజ్ జలసంధి దగ్గర అమెరికా సెంట్రల్ కమాండ్ పహారా కాస్తున్నా, కనీసం 10 భారతీయ ట్యాంకర్లు సురక్షితంగా ముంబై తీరానికి చేరుకోవడం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఇది కేవలం అదృష్టం కాదు, అత్యంత వ్యూహాత్మకంగా భారత్ ఎంచుకున్న ‘బైపాస్ రూట్’ ఫలితం.
టెక్నిక్ ఇదే.
ఈ సాహసయాత్ర వెనుక ఒక ఆసక్తికరమైన టెక్నిక్ ఉంది. ముంబైకి బయలుదేరే ఆయిల్, ఎల్పీజీ ట్యాంకర్లు ఒమన్ ప్రాంతీయ జలాల్లోకి ప్రవేశించగానే తమ ట్రాన్స్పాండర్లను (AIS) ఆఫ్ చేస్తున్నాయి. అంటే, రాడార్లకు ఈ నౌకలు ఎక్కడున్నాయో చిక్కవు. గల్ఫ్ ఆఫ్ ఒమన్ మీదుగా వస్తూ, అమెరికా యుద్ధ నౌకల కళ్లు గప్పి ముస్కాట్ తీరం దాటాక మళ్లీ సిగ్నల్స్ ఆన్ చేస్తున్నాయి. ఈ ‘ఘోస్ట్ షిప్పింగ్’ పద్ధతి ద్వారా భారత్ తన ఇంధన నిల్వలను కాపాడుకుంటోంది.దీనికి రాజకీయ బలం కూడా తోడైంది. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఇరాన్ విదేశాంగ మంత్రితో జరిపిన చర్చలు ఫలించాయి. “భారత్, రష్యా, చైనా వంటి మిత్ర దేశాలకు హార్ముజ్ జలసంధి ఎప్పుడూ తెరిచే ఉంటుంది” అని ఇరాన్ స్పష్టం చేయడం మనకు కలిసొచ్చింది. అయితే ఇది అంత సులభంగా జరగడం లేదు. “హార్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే మార్కెట్ రోజుకు 13 మిలియన్ బారెళ్ల చమురును కోల్పోయే ప్రమాదం ఉంది” అని అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) హెచ్చరించింది. బ్రెంట్ క్రూడ్ ధర ఇప్పటికే బారెల్కు 109 డాలర్ల వద్ద ఊగిసలాడుతోంది.
భారత నౌకాదళం కూడా ఇక్కడ కీలక పాత్ర పోషిస్తోంది. ఇరాన్ జలాల నుంచి బయటపడిన వెంటనే ‘దేశ్ గరిమా’ వంటి ట్యాంకర్లకు ఇండియన్ నేవీ రక్షణ కల్పిస్తోంది. అయితే, అందరికీ ఇది సాధ్యపడటం లేదు. జగ్ అర్నవ్ వంటి నౌకలపై కాల్పులు జరగడం చూస్తుంటే, ఈ రూట్ ఎంత ప్రమాదకరమో అర్థమవుతోంది.మనం 10 నౌకలు వచ్చాయని సంతోషిస్తున్నాం కానీ, ఇంకా 19 భారతీయ నౌకలు అక్కడ చిక్కుకుపోయి ఉన్నాయి. వాటిలో ఎల్పీజీ (వంట గ్యాస్), ఎల్ఎన్జీ ఉన్నాయి. అవి గనుక రావడం ఆలస్యమైతే దేశంలో వంట గ్యాస్ కొరత వచ్చే ప్రమాదం ఉంది.