దేశరాజధాని దిల్లీ (Delhi)లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇండియా కూటమి (INDIA blocs) నుంచి కాంగ్రెస్ (Congress)ను దూరం పంపించాలని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) డిమాండ్ చేసింది..’దిల్లీ ఎన్నికల్లో భాజపాకు లభ్యం చేకూరేందుకు కాంగ్రెస్ అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ భాజపా స్క్రిప్ట్ను చదివారు. ఆయన హద్దులు దాటి మా పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 24 గంటల్లో పార్టీ ఆయనపై చర్యలు తీసుకోవాలి. లేదంటే ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ను తప్పించేందుకు ఇతర పార్టీలతో మాట్లాడతాం’ అని ఆప్ నేత సంజయ్ సింగ్ (Sanjay Singh) పేర్కొన్నారు.
దేశ రాజధాని అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమితో పొత్తు లేకుండా ఒంటరిగానే పోటీ చేస్తామని ఇప్పటికే కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ (Ajay Maken) ఆప్ని ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. 2013లో 40 రోజుల పాటు ఆప్నకు మద్దతివ్వడం కాంగ్రెస్ చేసిన అతి పెద్ద తప్పిదమన్నారు. అందువల్లే దిల్లీలో కాంగ్రెస్ బలహీనపడిందని, తాము చేసిన ఆ పొరపాటును ఇప్పటికైనా సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అయితే, ఇది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. దేశ రాజధానిలో కాలుష్య నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, మౌలిక సదుపాయాల కల్పనలో విఫలమయ్యాయంటూ ఆప్, భాజపాలపై అజయ్ మాకెన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దీనిపై ఆప్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. తాజా వ్యాఖ్యలు చేసింది.