ట్రంప్‌కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చేలా రష్యాలోని భారత రాయబారి వినయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు..!

రష్యా నుంచి ముడి చమురును కొంటున్నందుకు భారత్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన మరో 25 శాతం దిగుమతి సుంకం బుధవారం (ఆగస్టు 27) నుంచి అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో ట్రంప్‌కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చేలా రష్యాలోని భారత రాయబారి వినయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తక్కువ రేటు ఎక్కడుంటే అక్కడే భారతీయ కంపెనీలు ముడి చమురును కొంటాయని, ఇప్పుడు అదే జరుగుతోందని, ఇకపైనా అదే జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. రష్యా ప్రభుత్వ వార్తా సంస్థ ‘టాస్’ (TASS)కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వినయ్ కుమార్ ఈ విషయాన్ని వెల్లడించారు.

రష్యా నుంచి ముడి చమురును కొంటున్నందుకు భారత్‌‌పై అదనంగా మరో 25 శాతం దిగుమతి సుంకాన్ని విధించాలనే అమెరికా నిర్ణయం అసమంజసం, అన్యాయం, అహేతుకమని వినయ్ కుమార్ అన్నారు. దేశంలోని 140 కోట్ల మందికిపైగా భారతీయులకు ఇంధన భద్రతను కల్పించడంపైనే భారత్ ప్రధాన ఫోకస్ ఉంటుందని ఆయన తేల్చి చెప్పారు. భారత్‌పై అమెరికా 50 శాతం దిగుమతి సుంకాలను విధించిన నేపథ్యంలో, జాతీయ ప్రయోజనాల పరిరక్షణ కోసం భారత సర్కారు అవసరమైన చర్యలను మొదలు పెట్టిందన్నారు. రష్యా సహా పలు దేశాలతో భారత్ కలిసి పనిచేసినందు వల్లే అంతర్జాతీయ ముడి చమురు మార్కెట్ ఇప్పటికీ నిలకడగా ఉందని వినయ్ కుమార్ గుర్తు చేశారు..రష్యా, భారత్ ద్వైపాక్షిక సంబంధాలు అనేవి ఇరుదేశాల ఉమ్మడి ప్రయోజనాలతో ముడిపడి ఉన్నాయని వినయ్ కుమార్ తెలిపారు. వాణిజ్యం (ఎగుమతి, దిగుమతులు) అనేది కమర్షియల్ అంశాల ప్రాతిపదికన జరుగుతుందని, ఆ లెక్కన చౌకగా లభించే చోటు నుంచే భారతీయ కంపెనీలు ముడిచమురును కొంటాయన్నారు. ఇప్పుడు కూడా అదే జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. అమెరికాతో పాటు పలు ఐరోపా దేశాలు నేటికీ రష్యాతో వాణిజ్యాన్ని కంటిన్యూ చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు…