భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ఇండియాకు వ్యతిరేక నినాదాలు చేశారన్న ఆరోపణలపై తనతో పాటు తన కుటుంబాన్ని అరెస్టు చేసి ఆస్తులను ధ్వంసం చేశారంటూ ఓ వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు..ఈ చర్యలు 2024 నవంబర్ 13న సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ఉల్లంఘిస్తున్నాయని, తన ఆస్తిని పునరుద్ధరించి, తగిన పరిహారం చెల్లించేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కక్షిదారు అభ్యర్థనలో కోరారు. దీనిపై సోమవారం విచారణ జరిపిన జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ల ధర్మాసనం…షోకాజ్ నోటీసులు లేకుండా, బాధిత పక్షం స్పందించడానికి 15 రోజుల సమయం ఇవ్వకుండా వారి ఆస్తులను కూల్చివేయడం సమంజసం కాదని పేర్కొంది. కక్షిదారు అభ్యర్థనపై స్పందించాలంటూ మహారాష్ట్ర అధికారులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాల తర్వాతకు వాయిదా వేసింది.
క్రికెట్ ప్రపంచ ఛాంపియన్షిప్ క్రీడల్లో భాగంగా భారత్-పాకిస్థాన్ మ్యాచ్లో ఇండియాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారన్న ఆరోపణలపై మహారాష్ట్రలోని సింధుదుర్గ్కు చెందిన కితాబుల్లా హమీదుల్లా ఖాన్ను, ఆయన భార్య, 14 ఏళ్ల కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాలుగు గంటల తర్వాత కుమారుడిని విడిచిపెట్టాగా.. బాధితుడి పాత ఇనుము, చెత్త దుకాణాన్ని, ఇంటిని అక్రమ నిర్మాణాల పేరుతో ఫిబ్రవరి 24న అధికారులు కూల్చివేసినట్లుగా అభ్యర్థనలో తెలిపారు. మరుసటి రోజు 25న భార్యాభర్తలిద్దరు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేయడంతో బయటకు వచ్చారు..