అరేబియా సముద్రంలో పాకిస్తాన్ నావికా దళం దుందుడుకు చర్యకు పాల్పడడంపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం..

అరేబియా సముద్రంలో పాకిస్తాన్ నావికా దళం దుందుడుకు చర్యకు పాల్పడడంపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిన్న పాకిస్తాన్ యుద్ధనౌక ఒకటి వేగంగా వచ్చి భారత నిఘా నౌకను ఢీకొట్టింది. ఈ ఘటనపై పాక్ దౌత్యాధికారికి భారత్ సమన్లు జారీ చేసింది. పాక్ నావికా దళాన్ని అదుపులో పెట్టుకోవాలని పాక్కు భారత విదేశాంగ శాఖ గట్టి హెచ్చరికలు చేసింది.

ఉత్తర అరేబియా సముద్ర జలాల్లో సెప్టెంబర్ 15వ తేదీ సాయంత్రం సాధారణ నిఘా కార్యకలాపాల్లో ఉన్న భారత నావికాదళ యుద్ధనౌక సమీపంలోకి పాకిస్తాన్ నావికాదళ నౌక అత్యంత వేగంగా దూసుకొచ్చింది. వృత్తిపరమైన ప్రమాణాలను గాలికి వదిలేసి ప్రమాదకరమైన రీతిలో పాక్ నౌక చేసిన ఈ దుస్సాహసంతో రెండు నౌకలు ఢీకొన్నాయి. అయితే ఈ ఘటనలో భారతీయ నావికాదళ సిబ్బందికి గాని, యుద్ధ నౌకకు గాని ఎటువంటి ఆస్తి లేదా ప్రాణ నష్టం జరగలేదని ప్రాథమికంగా తెలుస్తోంది.

ఎలాంటి నష్టం జరగనప్పటికీ, పాకిస్తాన్ నావికాదళం చేసిన ఈ బాధ్యతారహిత చర్యను భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అత్యంత తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటన అనంతరం పాక్ దౌత్యాధికారికి సమన్లు జారీ చేసి గట్టిగా మందలించింది. సముద్ర జలాల్లో కార్యకలాపాలు నిర్వహించేటప్పుడు పాకిస్తాన్ సైనిక విభాగాలు, నౌకలు అన్ని విధాల తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించింది. అంతర్జాతీయ నావికా ప్రమాణాలకు అనుగుణంగా వ్యవహరించాలని పాకిస్తాన్‌కు కఠినంగా సూచించినట్లు విదేశీ మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎదుట ఇదే విధమైన తీవ్ర నిరసనను నమోదు చేయాల్సిందిగా ఇస్లామాబాద్‌లోని భారత దౌత్యాధికారిని ఎంఈఏ ఆదేశించింది. ఈ ఘటనను భారత నావికాదళం తీవ్రంగా పరిగణించి, ఉన్నత స్థాయిలో సమీక్షిస్తున్నట్లు సమాచారం.