అహ్మదాబాద్‌లో నేడు ఐపీఎల్ ఫైనల్ ఫైట్‌…

అహ్మదాబాద్‌లో నేడు ఐపీఎల్ ఫైనల్ ఫైట్‌
టైటిల్‌ కోసం పోటీపడుతున్న బెంగళూరు-పంజాబ్‌
రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానున్న మ్యాచ్‌
ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్‌ గెలవని ఇరుజట్లు
18 ఏళ్లుగా లీగ్‌లో ఉన్నా ట్రోఫీ అందుకోని ఇరుజట్లు
తొలి కప్‌ కోసం బెంగళూరు, పంజాబ్ అమీతుమీ
2014లో ఫైనల్‌లో ఓడిన పంజాబ్‌ కింగ్స్‌
బెంగళూరుకు ఇది నాలుగో ఫైనల్‌
2009, 2011, 2016లో ఫైనల్స్ ఆడిన ఆర్సీబీ
ఫైనల్‌కు వానగండం, ఆందోళనలో ఫ్యాన్స్‌
మ్యాచ్‌ ఆగితే బుధవారం నిర్వహించనున్న బీసీసీఐ….

క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ ఫైనల్ పోరుకు రంగం సిద్ధమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఇవాళ జరగనున్న ఈ టైటిల్ ఫైట్‌లో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ రెండు జట్లలో ఏది గెలిచినా, వారికి ఇదే తొలి ఐపీఎల్ ట్రోఫీ కానుండటం విశేషం. ఈ మెగా ఫైట్‌కు ముందు, సోమవారం ఇరుజట్ల కెప్టెన్లు శ్రేయస్ అయ్యర్ (పీబీకేఎస్), రజత్ పాటిదార్ (ఆర్సీబీ) ఐపీఎల్ ట్రోఫీతో ప్రత్యేక ఫోటోషూట్‌లో పాల్గొన్నారు. ఈ వీడియోను ఐపీఎల్ త‌న అధికారిక ఎక్స్ (ట్విట్ట‌ర్‌) ఖాతా అభిమానుల‌తో పంచుకుంది.

లీగ్ దశలో అద్భుత ప్రదర్శనతో తొలి రెండు స్థానాల్లో నిలిచిన ఈ జట్లు, ఫైనల్ చేరే క్రమంలోనూ తమదైన ముద్ర వేశాయి. క్వాలిఫయర్-1లో పంజాబ్‌పై ఘన విజయం సాధించిన ఆర్సీబీ, నాలుగోసారి ఫైనల్‌కు దూసుకెళ్లింది. మరోవైపు, పంజాబ్ కింగ్స్ జట్టు క్వాలిఫయర్ -2లో ముంబై ఇండియన్స్ (ఎంఐ) అడ్డంకిని అధిగమించింది. ఈ సీజన్‌లో ఈ రెండు జట్లు ఇప్పటికే మూడుసార్లు ముఖాముఖి తలపడ్డాయి.

ఫైనల్ మ్యాచ్‌కు ముందు తమ వ్యూహాల గురించి కెప్టెన్లు పంచుకున్నారు. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ మాట్లాడుతూ… “ఆర్సీబీ లాంటి జట్టుకు ఫైనల్‌లో నాయకత్వం వహిస్తున్నప్పుడు అంచనాలు సహజంగానే ఉంటాయి. అయితే, నేను ఎప్పుడూ నా నియంత్రణలో ఉన్నవాటిపైనే దృష్టి పెడతాను. ప్రస్తుతంపైనే ఏకాగ్రత సారిస్తాను. ఈ కెప్టెన్సీ ప్రయాణం నాకు గొప్ప అనుభవాన్ని ఇచ్చింది. అత్యుత్తమ నాయకులు, విదేశీ ఆటగాళ్లతో కలిసి పనిచేయడం నా దృక్పథాన్ని మార్చింది. దేశీయ, అంతర్జాతీయ ఆటగాళ్లు ఆత్మవిశ్వాసంతో ఉండేలా, ప్రశాంతమైన వాతావరణాన్ని జట్టులో కల్పించడంపై దృష్టి సారించాను. మేం ఫైనల్ అనే వేదిక గురించి ఎక్కువగా ఆలోచించడం లేదు. మా అత్యుత్తమ క్రికెట్ ఆడటానికి ఇక్కడికి వచ్చాం” అని తెలిపాడు..