ఇరాన్ కీలక నిర్ణయం…!

ఇరాన్ కీలక నిర్ణయంపై ఆలోచిస్తోంది. ప్రపంచానికి అత్యంత ముఖ్యమైన సముద్ర మార్గాల్లో ఒకటైన హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై టోల్ ఫీజులు విధించే ప్రతిపాదనను పరిశీలిస్తోంది.

యుద్ధ ముప్పు నిధి 1000 కోట్లు…!

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రమవడంతో హోర్ముజ్‌ వంటి ప్రమాదకర జలాల గుండా రాకపోకలు సాగించే నౌకలకు రక్షణ అందించే బీమా సంస్థలు భయపడుతున్నాయి. ఈ క్రమంలో బీమా సంస్థలకు అండగా నిలవాలని భారత్‌ భావిస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా రూ.1000 కోట్లమేర యుద్ధ ముప్పు నిధిని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఆర్థిక శాఖ పరిశీలనలో ఉన్న ఈ ప్రతిపాదన.. బీమా లభ్యతలో పెరుగుతున్న అంతరాన్ని తగ్గించనుంది..

ఇంటర్నెట్ సేవలపై ఇరాన్ దృష్టి..!

బాంబుల వర్షంతో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నవేళ ఆ దేశానికి చెందిన లక్షలాది మంది పౌరులు మరో తీవ్ర సమస్యను ఎదుర్కొంటున్నారు. సంపూర్ణ ఇంటర్నెట్‌ నిలిపివేతతో వారంతా ప్రపంచానికి దూరమయ్యారు. సుదూర ప్రాంతాల్లో ఉంటున్న తమ కుటుంబ సభ్యులు, ఆప్తులను సంప్రదించడం వారికి అసాధ్యంగా మారింది. సమాచార ధ్రువీకరణలో మీడియా ప్రతినిధులు సైతం ఇబ్బందులు పడుతున్నారు.

వారాల తరబడి కొనసాగుతున్న ఈ పరిస్థితి సమాచార నియంత్రణ, భద్రత, సెన్సార్‌షి్‌పపై ఆందోళనలను రేకెత్తిస్తోంది. హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌ తదితర పర్యవేక్షక సంస్థల నివేదికల ప్రకారం.. సాధారణ స్థాయితో పోలిస్తే ఇరాన్‌లో ఇంటర్నెట్‌ కనెక్టివిటీ 1 నుంచి 4 శాతానికి పడిపోయింది. ఫిబ్రవరి చివర్లో అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులు ప్రారంభించిన వెంటనే బ్లాక్‌అవుట్‌ ప్రారంభమైంది.

అప్పటినుంచి దేశవ్యాప్తంగా ఇంటర్నెట్‌ సేవలు నిలిచిపోయాయి. దాదాపు 99శాతం మంది ఇరాన్‌ పౌరులకు ఇంటర్నెట్‌ సదుపాయం సక్రమంగా అందడంలేదని విశ్లేషకులు చెబుతున్నారు. సున్నితమైన సమాచారం బయటకు పొక్కకుండా నిరోధించడం, నిరసనకారుల మధ్య సమన్వయాన్ని అడ్డుకోవడం, యుద్ధ సమయంలో సమాచార ప్రవాహాన్ని నియంత్రించడం వంటి లక్ష్యాలతోనే ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకుంటోందని న్యూయార్క్‌ టైమ్స్‌, గార్డియన్‌ నివేదికలు పేర్కొంటున్నాయి. వ్యతిరేక స్వరాలను అణచివేయడానికి, అసమ్మతిని కప్పిపుచ్చేందుకు ఇంటర్నెట్‌ సేవల నిలిపివేతను ఇరాన్‌ ప్రభుత్వం ఒక సాధనంగా వినియోగించడాన్ని ఒక సంప్రదాయంగా పాటిస్తోందని మానవ హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి.

అయితే భద్రతా కారణాలరీత్యానే ఈ చర్య తీసుకున్నామని ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ స్పష్టం చేశారు. మరోవైపు ఇంటర్నెట్‌ సేవల కోసం కొంతమంది ఇరాన్‌ పౌరులు ఉపగ్రహ ఇంటర్నెట్‌ పరికరాలను ఉపయోగిస్తున్నారని తెలుస్తోంది. అయితే వీటిలో చాలావరకూ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం…