ఇజ్రాయెల్‌పై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి దాడి..ఖమేనీ మరణంపై పుతిన్ ఆగ్రహం

ఖమేనీ మరణంపై పుతిన్ ఆగ్రహం.

ప్రధాని మోదీ CCS అత్యవసర సమావేశానికి పిలుపు

హైదరాబాద్ పాతబస్తీలో భారీ ర్యాలీ

అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించారు. ఈ విషయాన్ని ఇరాన్ సైన్యం ధృవీకరించింది. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఖమేనీ మృతి చెందారని ప్రకటించారు. తొలుత దీనిని ఇరాన్ ఖండించింది. చివరకు ఖమేనీ చనిపోయినట్లు ఆ దేశ సైన్యంతో పాటు మీడియా కన్ఫార్మ్ చేసింది…

ఖమేనీ మరణంపై పుతిన్ ఆగ్రహం.

ఇరాన్ సుప్రీం అయతుల్లా అలీ ఖమేనీ, అతని కుటుంబ సభ్యుల మరణంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్‌కు తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ తెలిపారు. మానవ నీతిని, అంతర్జాతీయ చట్టాన్ని స్పష్టంగా విస్మరించి ఈ హత్య జరిగిందని పుతిన్ పేర్కొన్నారు. రష్యా – ఇరాన్ మధ్య స్నేహపూర్వక సంబంధాలను బలోపేతం చేయడానికి కృషి చేసిన అత్యుత్తమ రాజనీతిజ్ఞుడిగా ఖమేనీ రష్యాలో గుర్తుండిపోతారని ఆయన అన్నారు. ఖమేనీ బంధువులు, అభిమానులకు, అలాగే ఇరాన్ ప్రభుత్వానికి, ఆదేశ ప్రజలకు తన సంతాపాన్ని, మద్దతును తెలియజేశారు పుతిన్..

ప్రధాని మోదీ CCS అత్యవసర సమావేశానికి పిలుపు.

అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న వివాదం మధ్య, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రాత్రి భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశాన్ని నిర్వహించనున్నారు. సిసిఎస్ సమావేశానికి ప్రధాని మోదీ అధ్యక్షత వహిస్తారు. హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హాజరవుతారు.

ఇజ్రాయెల్‌పై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి దాడి.

జెరూసలేం నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న బీట్ షెమెష్‌ను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్‌పై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. అల్ జజీరా కథనం ప్రకారం, ఈ దాడిలో కనీసం నలుగురు మరణించారు. మరో 20 మంది గాయపడ్డారు.

పాక్ ప్రధాని షాబాజ్ తొలి స్పందన.

ఇరాన్ సుప్రీం నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ మరణం పట్ల పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ విచారం వ్యక్తం చేశారు. ఇరాన్ ప్రజలు దుఃఖంలో ఉన్నప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం వారికి తోడుగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఖమేనీ మరణాన్ని షాబాజ్ అమరవీరునిగా అభివర్ణించారు.

హైదరాబాద్ పాతబస్తీలో భారీ ర్యాలీ.

ఇరాన్‌పై దాడిని నిరసిస్తూ హైదరాబాద్ పాతబస్తీలో భారీ ర్యాలీ చేశారు ముస్లింలు. ఖమేనీ మృతికి సంతాపంగా వందలాది మంది నిరసన తెలిపారు. ఇజ్రాయెల్‌, అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు..